భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్

by Javid Pasha |   ( Updated:2022-12-21 12:35:39.0  )
భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒమిక్రాన్‌ బీఎఫ్-7 వేరియంట్‌ కారణంగానే చైనాలో కరోనా పరిస్థితి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. చైనాలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులకు కారణమైన ఈ వేరియంటే...తాజాగా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్‌లోని వడోదరలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు ఈ వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. జీనోమ్‌ సీక్వెనింగ్‌లో వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గుర్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఇందులో గుజరాత్‌లో ఇద్దరు, ఒరిస్సాలో ఒక్కరికి ఈ వేరియంట్ సోకినట్లు ప్రకటించారు. ఇప్పటివరకు భారత్‌లో 4 ఒమిక్రాన్‌ బీఎఫ్-7 వేరియంట్‌ కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టులలో హైఅలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌ టెస్ట్‌లు చేయాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కంపల్సరీగా కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులు ఆదేశించారు. కాగా, నేడు కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ అత్యున్నత స్ధాయి సమీక్ష నిర్వహించింది.

కరోనా ముప్పు ఇంకా పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో జనం మాస్క్‌లను ధరించాలని కేంద్రం సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతి ఒక్కరు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించింది. కొత్త వేరియంట్‌ కారణంగా కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టులో టెస్ట్‌లను కంపల్సరీ చేశారు. మరోవైపు చైనాలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్ 7 తోనే వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. బీజింగ్‌తో సహా పలు నగరాలలోని ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనాతో చనిపోయిన వాళ్ల శవాల గుట్టలే కన్పిస్తున్నాయి. కరోనాతో రానున్న రోజుల్లో లక్షలాదిమంది చనిపోయే అవకాశముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో 60 శాతం జనాభాకు కరోనా సంక్రమించే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed