హై రిస్క్ తీసుకున్న లైఫ్‌కు కరోనా

by Shyam |   ( Updated:2020-07-26 01:15:18.0  )
హై రిస్క్ తీసుకున్న లైఫ్‌కు కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: ల్యాబ్ టెక్నీషియన్ గోవర్ధన్ మృతి వైద్య సిబ్బందిని కలవర పెడుతోంది. ఆయన చెస్ట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. కొంత కాలంగా కరోనా రోగులకు స్క్వాబ్ తీయడంలో కీలకంగా పని చేశారు. 14 రోజులుగా కరోనాతోనూ పోరాడారు. శనివారం తెల్లవారు జామున మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లకు పాజిటివ్‌గా తేలింది. మరో ఇద్దరు ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. దీంతో వాళ్లతో పరీక్ష చేయించుకున్న వారూ ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నామని, తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరవుతున్నామని ల్యాబ్ టెక్నీషియన్లు వాపోతున్నారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం తమ విధులు కాకపోయినా తామే స్క్వాబ్ సేకరిస్తుండడం వల్లే తమ ప్రాణాలు పోతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, నిమ్స్, చెస్ట్ ఆసుపత్రి సిబ్బంది కరోనా యుద్ధంలో ముందు వరుసలో ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్ రే, ఈసీజీ టెక్నీషియన్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు కరోనా బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. దానికి అవసరమైన సదుపాయాలను, మెటీరియల్‌ను కల్పించాలని కోరుతున్నారు.

వైరస్‌తో యుద్ధం చేస్తున్నాం: మంచాల రవీందర్, ప్రధాన కార్యదర్శి, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోన్న వారిలో మేం ముందు వరుసలో ఉన్నాం. టీబీ స్క్రీనింగ్, పెద్దలకు వైద్య పరీక్షలు.. ఆఖరికి జనరల్ ఓపీలోనూ పరీక్షలు చేస్తున్నాం. పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణీ చేయడం లేదు. ఇకనైనా మాకు రిస్క్ అలవెన్స్ నెలకు రూ.3 వేలు ఇవ్వాలి. అది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇవ్వాలి. ల్యాబ్ టెక్నీషియన్లందరికీ క్వారంటైన్ లీవ్ ఇవ్వాలి.

రక్షణ చర్యలు తీసుకోవాలి

– సాధారణ చికిత్సల కోసం వచ్చే వారిని నియంత్రించాలి.
– ఆన్‌లైన్‌లో అపాయింట్ మెంట్ తీసుకొని ఆసుపత్రికి రావాలి.
– ఎమర్జెన్సీలో మాత్రమే ఆసుపత్రికి రావాలి. రోగి వెంట ఒక్కరు మాత్రమే రావాలి. విధిగా మాస్క్‌లు ధరించాలి.
– ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సేవలు అందించక పోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరుగుతోంది. ఔట్ పేషెంట్ విభాగాల్లో రద్దీ మూలాన వైరస్ విజృంభిస్తోంది. దాంతో పలువురు డాక్టర్లు, సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు.
– పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ పూర్తి జాగ్రతలు తీసుకోవాలి.
– వారికి పూర్తి స్థాయి పీపీఈ కిట్లను ప్రభుత్వం అందించాలి.
– ప్రభుత్వం వైద్య, పారా మెడికల్, నర్సింగ్ సిబ్బందిని రెండు బృందాలు‌గా విభజించి ఒక్కో బృందంతో సేవలు అందిస్తూ మరో బృందాన్ని క్వారంటైన్‌లో ఉంచాలి.
– ప్రజల్లో లక్షణాలు కనిపించకున్నా వైరస్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులను పాజిటివ్ వ్యక్తి గానే భావించి మూడు సూచనలు పాటించాలి. అందుకే భౌతిక దూరం పాటించాలి. అత్యవసరం అనుకుంటే బయటికి రావాలి. తక్కువ టైమ్ ఇంటి బయట గడపాలి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి.
– స్వీయ రక్షణే కరోనా నుంచి కాపాడుతుందని నిమ్స్ పారా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ స్పష్టం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed