- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. ప్రైవేటు హాస్పిటళ్లలో భయం
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ ప్రజల్లోకి వెళ్లిపోయింది.. కమ్యూనిటీ వ్యాప్తి జరుగుతోంది.. అంటూ స్వయంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలకు, ఓపీ సేవలకు కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. ఓపీ కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్నవారిలో ఎంత మందికి కరోనా పాజిటివ్ అనేది తెలియక వైద్య సిబ్బందికి, ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్లకు వైరస్ వ్యాప్తి జరుగుతోంది. యాంటీ జెన్ టెస్టులు చేసి నిర్ధారణ చేసుకోవడానికి ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి లేకపోవడంతో వైద్య సిబ్బంది వారిని వారు కాపాడుకోలేక, ఇన్‌పేషెంట్లను కాపాడలేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ప్రైవేటు ఆసుపత్రికి కూడా యాంటీజెన్ టెస్టులు చేసుకోవడానికి అనుమతి మంజూరు కాలేదు. కానీ చాలా కార్పొరేటు ఆసుపత్రులు ఈ టెస్టుల్ని గుట్టుచప్పుడు కాకుండా చేస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకూ ఏ ఆసుపత్రి కూడా తమను సంప్రదించలేదని, దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వ్యాఖ్యానిస్తున్నారు.
కంటికి తెలియకుండా వైరస్ వ్యాప్తి
రోజువారీ అనారోగ్య అవసరాలకు ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తూనే ఉన్నారు. అయితే ప్రతి పేషెంట్‌నూ అనుమానిత పాజిటివ్ వ్యక్తిగానే పరిగణిస్తూ వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా తెలియకుండానే వైరస్ వైద్య సిబ్బందికి, పక్కనే కూర్చున్న ఇతర ఓపీ పేషెంట్లకు అంటుకుంటూ ఉంది. చివరకు అది వార్డుల్లో ఉన్న ఇన్‌పేషెంట్లకు కూడా సోకుతూ ఉంది. కరోనా చికిత్స కోసం కొన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా చాలా చోట్ల ఐసీఎంఆర్ సూచించిన నిబంధనలను పాటించకపోవడంతో నాన్-కొవిడ్ పేషెంట్లకు కూడా వైరస్ అంటుకుంటోంది. ఓపీ సేవలకు కూడా ఇది అతీతమే కాదని చాలా సందర్భాల్లో తేటతెల్లమైంది. ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు చివరకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతున్నది ఈ కారణంగానే.
అత్యవసర కేసుల్లోనూ ముప్పు తప్పడం లేదు
కేవలం ఓపీ సేవలకు మాత్రమే కాక అత్యవసర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ల విషయంలోనూ ప్రైవేటు డాక్టర్లకు తిప్పలు తప్పడంలేదు. ఎమర్జెన్సీ కేసు కావడంతో వారిని వెంటనే క్యాజువాలిటీలో చేర్చుకోవాల్సి వస్తోందని, అయితే అప్పటికే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందో లేదో తెలుసుకోవడం ఆ అత్యవసర సమయంలో సాధ్యం కావడంలేదు. ఒకవేళ విధిగా కరోనా పరీక్ష కోసం శాంపిల్‌ను తీసుకున్నా రిపోర్టు వచ్చేటప్పటికి ఒకటి రెండు రోజులు పడుతున్నందున అప్పటివరకూ ఆ పేషెంట్‌ను మిగిలినవారు ఉండే వార్డులో పెట్టాలో లేక ఐసొలేషన్ వార్డులో పెట్టాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో యాంటీజెన్ టెస్టులు చేసి కరోనాను నిర్ధారించుకునే అనుమతి ఉన్నట్లయితే వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు ఇతర పేషెంట్లకు సోకకుండా జాగ్రత్తపడవచ్చునని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వాసుపత్రులకే యాంటీజెన్ పరిమితం
రాష్ట్రంలో కరోనా టెస్టులు నిర్వహించడంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో దిగివచ్చిన వైద్యారోగ్య శాఖ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించడానికి ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి మంజూరు చేసింది. ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్నా పరిమిత సంఖ్యలోనే జరుగుతున్నాయి. దీనిపై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యాంటీజెన్ (ర్యాపిడ్) టెస్టుల్ని ప్రభుత్వమే నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికీ కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు, ల్యాబ్‌లకు మాత్రమే పరిమితమైంది.
ప్రైవేటు ల్యాబ్‌లలో ఎలాగూ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలకు అనుమతి ఉన్నందున యాంటీజెన్ చేయడానికి సుముఖంగా లేవు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా యాంటీజెన్ టెస్టులు చేసుకోడానికి అనుమతి లేకపోవడం పెద్ద వెలితిగా ఉందని యాజమాన్యాలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ససేమిరా అని నిరాకరించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించే నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వలేదు. ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకున్న కొన్ని ఆసుపత్రులకు అనుమతి లభించింది. కానీ రాష్ట్రంలోని నోడల్ అధికారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకోవాలని వివరించింది. కానీ రాష్ట్రంలో నోడల్ అధికారి ఎవరో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చే అధికారి ఎవరో చాలా ఆసుపత్రులకు ఇప్పటికీ అర్థంకాని బ్రహ్మ పదార్ధంగానే మిగిలిపోయింది.
అడిగినా అనుమతి ఇవ్వడం లేదు: డాక్టర్ అశోక్ రెడ్డి, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు
ప్రైవేటు ఆసుపత్రులకు యాంటీజెన్ టెస్టులు చేసుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మొదటి నుంచీ అడుగుతున్నాం. కానీ ఇవ్వలేదు. ఇందుకు రకరకాల కారణాలు చెప్పింది. కానీ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల ద్వారా కరోనా నిర్ధారణ చేయడానికి రెండు రోజుల సమయం పడుతోంది. ఈ లోపు ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. ప్రభుత్వానికి సరైన విధానం లేదు. వైరస్ తీవ్రతను, వ్యాప్తిని అంచనా వేయడంలో సర్కారు విఫలమైంది. పాజిటివ్ ఉన్నపేషెంట్లలో 80% మంది లక్షణాలు లేనివారేనని ప్రభుత్వమే చెప్తోంది. దీంతో అటు యాంటీజెన్ టెస్టులు చేయడానికి అనుమతి లేకపోవడం, మరోవైపు ఆర్‌టీ-పీసీఆర్ ఫలితాలు రెండు రోజులకు రావడంతో ఇతర పేషెంట్లకూ వైరస్ అంటుకుంటోంది. దరఖాస్తు చేసుకున్న అన్నిఆసుపత్రులకూ అనుమతివ్వాలి.
దరఖాస్తు చేసుకున్నవెంటనే అనుమతి ఇస్తాం: డాక్టర్ శ్రీనివాస్, ప్రజారోగ్య శాఖ
ఇప్పటివరకు ఏ ప్రైవేటు ఆసుపత్రి యాంటీజెన్ టెస్టులు చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించలేదు. దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి డిమాండ్ కూడా రాలేదు. రాష్ట్రంలో ఒక్క ప్రైవేటు ఆసుపత్రి కూడా ర్యాపిడ్ టెస్టులు చేయడం లేదు. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేసుకుంటున్నాయి. ఒకవేళ ర్యాపిడ్ టెస్టులు కూడా చేసుకోవడానికి అనుమతి కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అడిగిన వెంటనే అనుమతి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.