ఆ… విషయం మంత్రే చెప్పాడు

by Anukaran |   ( Updated:2020-07-11 23:11:26.0  )
ఆ… విషయం మంత్రే చెప్పాడు
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాను కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌కు వెళ్లి వచ్చిన వారికి, వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకుతుందని అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా వాసులు హైదరాబాద్ కు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 460 పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం, శనివారం కొత్తగా 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలో 14 మంది, మెదక్ జిల్లాలో ఐదుగురు, సిద్దిపేట జిల్లాలో ఒకరు కరోనా సోకి మృతి చెందారు.

రాజధానికి వెళ్లాలంటే జంకు

వివిధ పనుల నిమిత్తం జిల్లా నుంచి చాలా మంది హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, వైద్యం కోసం వెళ్లిన వారు వైరస్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు రావడంతో గ్రామాల్లో సైతం కరోనా ముప్పు తప్పడం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారు క్వారంటైన్ లో ఉండాలని రాష్ర్ట మంత్రి పేర్కొన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 460 కేసులు ఉండగా ఇంకా చాలా మందికి పరీక్షలు చేయాల్సి ఉంది. అలాగే సేకరించిన శాంపిల్స్ లో చాలా వరకు ఫలితాలు రాలేదు. దీంతో పాజిటివ్ కేసులు మరన్ని పెరిగే అవకాశముంది.

ఏదైనా అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ ప్రయాణాలన్నింటినీ జనం వాయిదా వేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటకతో భయాందోళనకు గురైన జిల్లా వాసులు ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అంటేనే జంకుతున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో హైదరాబాద్ వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి వైరస్ సోకింది.

Advertisement

Next Story

Most Viewed