ఆదిలాబాద్‌లో ఉలిక్కిపడ్డ ఉద్యోగులు

by Aamani |
ఆదిలాబాద్‌లో ఉలిక్కిపడ్డ ఉద్యోగులు
X

దిశ, ఆదిలాబాద్: నిన్నటిదాకా మర్కజ్ లింకుతో కరోనా బారినపడ్డ వివిధ ప్రాంతాల కేసులకు భిన్నంగా.. నిర్మల్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనా లాక్‌డౌన్ తర్వాత అత్యవసర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలతో పాటు పంచాయతీ శాఖకు చెందిన గ్రామస్థాయి పారిశుద్ధ్య కార్మికులు, కారోబార్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఆపైన స్థాయి అధికారులు విధుల్లో కొనసాగుతున్నారు.

కార్యదర్శికి కరోనాతో ఆందోళన

నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి కరోనా సోకడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మర్కజ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన పంచాయతీ కార్యదర్శికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఫస్ట్ కాంటాక్ట్ కింద వైరస్ సోకినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే మర్కజ్ నుంచి వచ్చిన గ్రామ రెవెన్యూ సహాయకుడు విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్లనే కరోనా వైరస్ పంచాయతీ కార్యదర్శికి సంక్రమించిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కార్యదర్శితో ఎందరికో..

కరోనా సోకిన ఆ కార్యదర్శి జిల్లాలోని ఒక మండలంలో పది మందికి పైగా సహచర కార్యదర్శులు, ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్నానని, కొందరి మోటార్ సైకిళ్లపై తిరిగానని చెప్పడం ఇప్పుడు కలవర పాటుకు గురి చేస్తుంది. మండల పరిషత్ కార్యాలయంతో పాటు, గ్రామ పంచాయతీకి వచ్చి పోయిన వారితోనూ ఆయన కాంటాక్ట్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఆ కార్యదర్శి నుంచి అధికారులు కాంటాక్ట్ వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరు గ్రామ కార్యదర్శులను కేంద్రానికి రావాలని, పరీక్షలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి పరిస్థితి ఇలా ఉంటే… ఇతర అత్యవసర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అనేక చోట్ల తిరిగారని అందరూ భయపడుతున్నారు.

tags: Corona Virus Positive, Secretary, Adilabad, Nirmal Districts, Employees, Friends, Delhi Markaz, Revenue

Advertisement

Next Story