పొలిటికల్ మీటింగ్‌లతోనే కరోనా.. కుండబద్దలు కొట్టిన డీహెచ్

by vinod kumar |
DH-Srinivasa-Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: పొలిటికల్ మీటింగ్‌లతో కరోనా వ్యాప్తి జరుతుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీల నాయకులు కరోనా విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు ఇప్పటి నుంచి సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పాదయాత్రలకు సిద్ధమవుతున్నరని చెప్పారు. ఈ కార్యక్రమాల వలన కరోనా వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించారు. మీటింగ్‌లో పాల్గొనే ప్రజలు జాగ్రత్తలు వహించకపోవడం వలన భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తెలిపారు.

సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోలేదని డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వివరించారు. వివిధ దేశాల్లో అక్కడి ప్రజల నిర్లక్ష్యం కారణంగా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్‌లు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోని కేరళ, మహారాష్ట్రలో ఇప్పటికి రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. సెకండ్ వేవ్‌లో వైరస్ సోకని వారికి వ్యాక్సిన్ వేయించుకోని వారికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రెండు నెలల కిందటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయన్నారు.

హెలికాఫ్టర్ పర్యటనల ద్వారా ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలో అధికంగా కేసులు నమోదువుతున్నట్టుగా గుర్తించామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 3 మండలాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతుందని చెప్పారు. మరో రెండు, మూడేళ్లు దాటితే తప్పా వైరస్ ప్రభావం తగ్గే అవకాశాలేవని స్పష్టం చేశారు. రోజుకు రెండు లక్షల వ్యాక్సిన్ మాత్రమే కేంద్రం నుంచి సరఫరా అవుతుందని, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజల నిర్లక్ష్యం వలన థర్డ్ వేవ్ సోకే ప్రమాదముందని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed