- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పారాసిటమాల్' నుంచి 'లాక్‌డౌన్' దాకా
– ఏప్రిల్ 20 నుంచి దేశమంతా ఆంక్షల సడలింపు
– తెలంగాణలో సడలింపులు లేవ్
– రేపు కేబినెట్ భేటీ.. ఆంక్షల సడలింపుపై నిర్ణయం
దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు జనవరి 30న నమోదైతే తెలంగాణలో మాత్రం మార్చి 4న (అధికారికంగా) తొలి కేసు నమోదైంది. ఆ టైమ్‌లో రాష్ట్రంలో వార్షిక బడ్జెట్ సమావేశాలు, ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా తీవ్రతను పాలకులు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘కరోనా మన దేశంలో పుట్టిన వ్యాధే కాదు. మన దగ్గర ఉన్న టెంపరేచర్‌లో అది బతకనే బతకదు.. దానికి మందే లేదు.. పారాసిటమాల్ వేసుకుంటే చాలు. మాస్క్‌ల అవసరమేముంది? అసలు మన రాష్ట్రంలో ఆ వ్యాధి లేనే లేదు’ అని మార్చి మొదటి వారంలో వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాస్క్‌ల అవసరమే లేదనే స్థాయి నుంచి ఇప్పుడు ఇంటి గడప దాటితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే నిబంధన దాకా పరిస్థితిలో మార్పు చోటుచేసుకుంది. చివరకు మాస్క్ అవసరమే లేదన్న సీఎం కేసీఆర్ సైతం మాస్క్ ధరించక తప్పలేదు. పారాసిటమాల్ వేసుకుంటే చాలు అనే దగ్గరి నుంచి 29 మంది చనిపోయేదాకా వచ్చింది. దేశమంతా రెండో విడత లాక్‌డౌన్ మే నెల 3వ తేదీదాకా అమల్లోవుంటే తెలంగాణలో మాత్రం మరో నాలుగు రోజులు అదనంగా మే 7 వరకు అమలవుతోంది.
ఇప్పుడు మూడో విడత లాక్‌డౌన్ విధించే పరిస్థితి రావడంతో అనివార్యంగా తెలంగాణ సైతం దాన్ని అమలుచేయక తప్పడంలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం రెండో విడత లాక్‌డౌన్ సందర్భంగానే కొన్ని ఆంక్షలను సడలించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేసి పూర్తి స్థాయిలో అమలుచేస్తోంది. తాజాగా మూడో విడత లాక్‌డౌన్ మే 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుండగా.. కేంద్రం మరికొన్ని ఆంక్షలను సడలించింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంక్షలను సడలిస్తుందా? లేక రెండో విడత సందర్భంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను కొనసాగించిన తరహాలోనే ఇప్పుడు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తుందా? లేదా ఏవైనా సడలింపులు ఇవ్వనుందా అనే విషయం ఈ నెల 5వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారు కానుంది.
లాక్‌డౌన్‌లో ప్రజల కదలికలు స్తంభించిపోయాయి. పరిశ్రమల్లో యంత్రాల చప్పుళ్ళు ఆగిపోయాయి. బస్సు ప్రగతి చక్రం ఆగిపోయింది. రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. వైరస్ వ్యాప్తి హైదరాబాద్ నగరంలో అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మొదటి, రెండో విడత లాక్‌డౌన్ కాలంలో కేవలం కరోనా వైరస్‌కు సంబంధించి పదిహేనుకు పైగా మీడియా సమావేశాలు.. మంత్రులతో, అధికారులతో విస్తృతంగా సమీక్షా సమావేశాలు, ఉన్నతస్థాయి సమావేశాలను నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించింది మొదలు ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం.
మార్చి 4 : రాష్ట్రంలో తొలి కరోనా కేసు అధికారికంగా నమోదైంది. చైనా నుంచి దుబాయి మీదుగా బెంగళూరు వచ్చి అక్కడి నుంచి తెలంగాణకు చేరుకున్న యువకుడికి పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది.
మార్చి 7 : కరోనాపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశంపై సీఎం కేసీఆర్ తీవ్రంగానే స్పందించారు. ‘అధ్యక్షా.. కరోనా కోసం ప్రభుత్వం మాస్క్‌లు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ప్రతిపక్ష సభ్యులు. కరోనా వస్తే గదా! అసెంబ్లీలో ఇంతమంది ఉన్నారు. ఎవరైనా మాస్క్ కట్టుకున్నారా అధ్యక్షా! మాస్క్ కట్టుకోకుంటే మనం సచ్చిపోతమా? ఆరోగ్య మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకు మాస్క్ ఉందా? అసలు మాస్క్ అవసరమేముంది? కరోనా అసలు మన రాష్ట్రంలో రాలేదు. 135 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఇప్పటికి 31 మందికే వచ్చింది. ఇందులో ఎవడో ఒక సన్నాసి, దరిద్రుడు మన దగ్గరకు వచ్చిండు. అది కూడా డైరెక్టుగా రాలేదు. చైనా నుంచి దుబాయి, బెంగళూరు మీదుగా వచ్చిండు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరికి కూడా కరోనా రాలేదు. అది మన దేశంలో పుట్టిన వ్యాధి కూడా కాదు. విమానాలు పెరిగాయి కాబట్టి ప్రయాణీకుల ద్వారా వచ్చింది’ అని అసెంబ్లీ వేదికగా అన్నారు.
‘భగవంతుడు చాలా శక్తి ఇచ్చాడు. అవసరమైతే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడతం. రాష్ట్రంలోకి వైరస్‌ని రానే రానియ్యం. వస్తే ఎదుర్కొంటం. సర్వ శక్తులూ ఒడ్డుతం. అవసరమైతే శాసనసభ సమావేశాలను బందు పెట్టి అందరం ఉరుకుతం. ఎవరి నియోజకవర్గంలో వారు నిలబడి మాస్క్‌లు కట్టుకోకుండనే పనిచేస్తం. ప్రజలకు లేని మాస్క్ మాకెందుకు?’ అని అన్నారు.
ఇంకా ఆ ప్రసంగంలోనే.. ‘కరోనా గురించి ఒక సైంటిస్టుతో మాట్లాడాను. కరోనా వట్టిదేనన్నారు. వైరస్ అధ్యయనం చేసే సైంటిస్టే ఆ మాట అన్నారు. జస్ట్ పారాసిటమాల్ గోలీ వేసుకుంటే చాలన్నారు. అంతకుమించి ఏమీ అక్కర్లేదన్నారు. ఎవరికొస్తదో రాదోగానీ మన తెలంగాణకు అస్సలే రాదన్నారు. ఎందుకంటే కరోనా వైరస్ 22 సెంటిగ్రేడ్ డిగ్రీలు దాటితే బతకనే బతకదన్నారు. ఎంత ఖతర్నాక్ వైరస్ అయినా 22 డిగ్రీల తర్వాత అది చచ్చిపోతదన్నారు. మన దగ్గర 35 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది కాబట్టి రమ్మన్నా రాదు అని అన్నారు. అందుకే మాస్క్ అనే పంచాయతీ అవసరం లేదు. ఇప్పటిదాకా తెలంగాణల వైరస్ రాలేదు. వైరాలో వచ్చిందన్నారు. కానీ అక్కడి ఎమ్మెల్యేనే స్వయంగా ఈ సభలో ఉన్నారు. వైరస్ వస్తే నేను ఇక్కడికెట్ల వస్త అని అంటున్నారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మార్చి 14 : కరోనా వైరస్‌పై అసెంబ్లీలో అత్యున్నత స్థాయి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. అదే రోజు సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైరస్‌పై పోరుకు రూ. 500 కోట్ల ప్రత్యేక నిధిని ఇస్తూ నిర్ణయం జరిగింది. విదేశీ ప్రయాణీకులు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తే థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచాలని నిర్ణయించడంతో పాటు ఇందుకోసం నాలుగు కేంద్రాలను, 321 ఐసీయూ బెడ్‌లను, 240 వెంటిలేటర్లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అదే రోజున అసెంబ్లీలో కరోనా వైరస్ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్చ చేశారు. ”కేంద్రం రకరకాల చర్యలు తీసుకుంటున్నందున రాష్ట్రం కూడా ఏమేం చర్యలు తీసుకోవాలో మంత్రివర్గంలో చర్చిస్తాం. జనం ఎక్కువగా గుమిగూడే పెళ్ళిళ్ళు, బర్త్‌డే పార్టీలు లాంటివి రద్దు చేయాలనుకుంటున్నాం. నిన్నమొన్నటిదాకా మనకు ఒక్కరే పాజిటివ్ పేషెంట్ ఉన్నారు. ఇప్పుడు మరొక కేసు నమోదైంది. ఇద్దరు అనుమానితులను క్వారంటైన్‌లో పెట్టాం. అన్ని వివరాలను సభ దృష్టికి తీసుకురావడం బాధ్యత. అందుకే ప్రత్యేక చర్చ జరుపుతున్నాం. కరోనాను మించిన పార్టీ కాంగ్రెస్” అని సీఎం అన్నారు.
మార్చి 14 : రాష్ట్రంలో పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మార్చి 31 వరకు మూసివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ. సినిమాహాళ్ళు, మ్యూజియంలు, జూ పార్కులు, ఫంక్షన్ హాళ్ళు, షాపింగ్ మాల్స్.. ఇలా జన సమ్మర్థం ఉన్న అన్ని కేంద్రాల బంద్. రెండు దశల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలు.
మార్చి 15 : కాంగ్రెస్‌ను కరోనాతో పోలుస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్; కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
మార్చి 16 : అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నిరవధిక వాయిదా
మార్చి 18 : కరీంనగర్ పట్టణంలో ఇండోనేషియా నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ యాత్రకు వెళ్ళివచ్చిన ఆ దేశ పౌరుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
మార్చి 19 : కరీంనగర్ సంఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. మర్కజ్ యాత్రికుడికి పాజిటివ్ రావడంతో కేంద్రాన్ని అప్రమత్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన ముస్లిం మత పెద్దలు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్. వైరస్ వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కేసీఆర్. చైనాలో ఈ వైరస్ పుట్టినా.. వియత్నాం, ద.కొరియా లాంటి దేశాలు తీసుకున్న పటిష్ట చర్యల ద్వారా నియంత్రించగలిగిన ఉదాహరణలను మీడియాకు వివరించిన కేసీఆర్.
మార్చి 20 : కరీంనగర్ పట్టణం దిగ్బంధం. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీధులను రసాయనాలతో శుభ్రం చేసిన సిబ్బంది. ఇండోనేషియా పౌరులతో కాంటాక్టులోకి వెళ్ళినవారిని గుర్తించే ప్రక్రియ మొదలు. కంటైన్‌మెంట్ జోన్‌లను ఏర్పాటుచేసి ఇంటింటికీ నిత్యావసరాల సరఫరా.
మార్చి 21 : ప్రగతి భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించి దేశంతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలో వైరస్ తీవ్రతను వివరించి మన రాష్ట్రంలో సరిహద్దు దగ్గర చెక్‌పోస్టులను ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడి. అవసరమైతే ఆ రాష్ట్రంతో రాకపోకలను బంద్ చేస్తామని స్పష్టీకరణ.
మార్చి 22 : కరోనాపైనా, లాక్‌డౌన్‌పైనా అత్యున్నత స్థాయి సమావేశం. మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలుచేయడం, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. మార్చి 22న ప్రధాని మోడీ ఇచ్చిన ‘చప్పట్లు కొట్టే కార్యక్రమం’లో పాల్గొన్న కేసీఆర్, మంత్రులు, అధికారులు. మీడియా సమావేశాన్ని నిర్వహించి మార్చి 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రతీ రేషనుకార్డుదారుల కుటుంబాలకు రూ. 1500 నగదు సాయం, కుటుంబంలోని ప్రతీ ఒక్కరికీ తలా పన్నెండు కిలోల బియ్యం ఉచిత పంపిణీపై ప్రకటన. వలస కార్మికులకు సైతం తలా ఆరు కిలోల బియ్యం, రూ. 500 నగదు సాయం ఇవ్వనున్నట్లు ప్రకటన.
మార్చి 24 : కరోనాపై ప్రగతి భవన్‌లో అత్యున్నత సమావేశం. సంప్రదాయ పద్ధతిలో రెండు గంగాళాలను ఏర్పాటుచేసి హ్యాండ్ వాష్ కార్యక్రమం. మంత్రులు, అధికారులు చేతులు కడుక్కున్న తర్వాతనే ప్రగతి భవన్‌లోకి ప్రవేశం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశమే వైరస్‌తో ఏగలేక ఇబ్బంది పడుతోందని, చివరకు పోలీసులతో నియంత్రించడం సాధ్యంకాక ఆర్మీని రంగంలోకి దించిందన్న కేసీఆర్. ఇక్కడ కూడా ఆ పరిస్థితి రాకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఒకవేళ ప్రజల నుంచి సహకారం లేకుంటే ఆర్మీని దింపి ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు లేదా కర్ఫ్యూ విధించక తప్పదని హెచ్చరిక. ఒక్క వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే అది ఆగదని, వంద మందికి, వెయ్యి మందికి వ్యాపిస్తుందని, చివరకు మొత్తం సమాజానికే అంటుకుంటుందని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలను ఆపే ప్రసక్తే లేదన్నారు.
ఆ రోజు నుంచి ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’కి విరాళాల వెల్లువ.
మార్చి 25 : ప్రగతి భవన్‌లో కరోనాపై కేసీఆర్ సమీక్ష. సోషల్ డిస్టెన్స్ విధానాన్ని మించిన మార్గం లేదని వైరస్ వ్యాప్తి నిరోధకంపై ప్రజలకు పిలుపు.
మార్చి 27 : ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. లాక్‌డౌన్ ప్రాధాన్యతపై వివరణ. అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు వెలువరించిన నివేదికలో జూన్ మాసం వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించిన కేసీఆర్. లాక్‌డౌన్‌ను పొడిగించడంపై కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నట్లు వెల్లడి.
మార్చి 29 : ప్రగతి భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించి మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలని, కరోనా నిర్ధారణ పరీక్షలకు ముందుకు రావాలని, వైద్యులను సంప్రదించాలని పిలుపు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోడానికి నిమ్మ, దానిమ్మ, ఆరెంజ్ లాంటి పండ్లను తినాలని పిలుపు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, దుకాణాలకు సరఫరా తదితరాలపై అధికారులతో చర్చ.
మార్చి 30 : ధాన్యం కొనుగోళ్ళు, పంటలకు అవసరమైన సాగునీటి సరఫరా తదితరాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష.
మార్చి 31 : రాష్ట్ర ఆర్థిక అంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల వేతానాల్లో తాత్కాలిక కోతపై నిర్ణయం.
ఏప్రిల్ 5 : ప్రధాని పిలుపు మేరకు దీపాలు వెలిగించే సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మంత్రులు, అధికారులు
ఏప్రిల్ 6 : ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలు తదితరాలపై సమీక్ష.
ఏప్రిల్ 7 : ప్రగతి భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్ ఏప్రిల్ 14తో ముగుస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదికను ఉదహరించి లాక్‌డౌన్‌ను మించిన ఆయుధం లేదన్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు, మెడికల్ సిబ్బందికి తగిన రక్షణ పరికరాలు (పీపీఈ, మాస్క్ లాంటివి) లేవని రాసినందుకు మీడియాపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. అలాంటి రాతలు రాసేవారికి కరోనా సోకుతుందని శాపనార్ధాలు పెట్టారు.
ఏప్రిల్ 10 : ఇంటి గడప దాటి బయటకొస్తే విధిగా మాస్క్ ధరించాలని తప్పనిసరి నిబంధన చేసిన తెలంగాణ ప్రభుత్వం.
ఏప్రిల్ 11 : మంత్రివర్గ సమావేశం. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరడంతో పాటు ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకు హెలికాప్టర్ మనీ ఇవ్వాలని, ఆరు నెలల వరకు రుణాల చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని… పలు ప్రతిపాదనలను మీడియాకు వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను రాసే మీడియాపై మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసి కరోనా సోకుతుందని శపించారు.
ఏప్రిల్ 13 : మాస్క్‌ల అవసరమే లేదని మార్చి 7వ తేదీన అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి మాస్కు ధరించారు. మాస్క్‌తోనే సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు.
ఏప్రిల్ 18 : రెండో విడత లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ఆంక్షల సడలింపులను తెలంగాణలో అమలుచేయడంపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ
ఏప్రిల్ 19 : దేశవ్యాప్తంగా రెండో విడత లాక్‌డౌన్ మే నెల 3వ తేదీ వరకు అమల్లోకి వచ్చినందున తెలంగాణలో మాత్రం మే 7వ తేదీ వరకు ఉంటుందని ప్రకటన. ఏప్రిల్ 20 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే సడలింపులను రాష్ట్రంలో అమలుచేయబోవడంలేదని, పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టీకరణ.
ఏప్రిల్ 23 : సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో వైరస్ స్థానిక వ్యాప్తికి గురికావడం, అనూహ్యంగా పాజిటివ్ కేసులు పెరగడంతో స్వయంగా ప్రధాన కార్యదర్శి, డీజీపీ క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశం. హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటన చేసిన వీరు రాత్రికి సీఎంతో సమావేశం.
ఏప్రిల్ 27 : ప్రధానితో వీడియో కాన్ఫరెన్సు. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రధాని. అదే రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేసీఆర్, రాష్ట్రంలోని దాదాపు 21 జిల్లాల్లో కరోనా యాక్టివ్ పాజిటివ్ కేసులు లేవని, త్వరలో తెలంగాణ కరోనారహిత రాష్ట్రమవుతుందని అన్నారు.
Tags: Telangana, Corona, No Mask, Compulsory Mask, Paracetamol, LockDown, Social Distance