భయపెడుతున్నారు.. బజార్‌లో కరోనా పేషెంట్లు..!

by Sridhar Babu |
భయపెడుతున్నారు.. బజార్‌లో కరోనా పేషెంట్లు..!
X

దిశ, మునుగోడు: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులే క్యారియర్‌లుగా మారుతున్నారా.. ! అంటే ప్రజల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో చౌటుప్పల్, మునుగోడు,నారాయణపురం మండలాల్లో కొవిడ్ పాజిటివ్ రోగులు నిత్యం రోడ్లపైనే తిరుగుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నయం అయ్యే వరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉండాలనే నిబంధనలు ఉన్నా.. వాటిని కొందరు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పాజిటివ్ వ్యక్తుల పై పర్యవేక్షణ కరువు..

గతంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను గుర్తించి వారిని, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచేవారు. అంతే కాకుండా వారికి నిత్యావసర వస్తువులను స్థానిక అధికారులు అందించి, ఇంట్లో నుంచి బయటకు రాకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కానీ, రెండో దశ కరోనా సమయంలో ఈ నిబంధనలను అధికారులు, ప్రజా ప్రతినిధులు అమలు చేయడం లేదు. కనీసం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అయినా బయటకు రాకుండా చూసే ఏర్పాట్లు చేయకపోవడంతోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు.

నిత్యావసరాల కోసమే బయటకి..

పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే వారు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తుందని సమాచారం. నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారని జనం భయంతో వణుకుతున్నారు. ఇంటి చుట్టుపక్కన ఒక వ్యక్తికి కరోనా వచ్చింది అనే విషయం తెలిసినా వారిని బయట తిరగవద్దు అని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా కొవిడ్ పేషెంట్లను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story