లాక్‌డౌన్‌లోనూ కరోనా ఔట్ బ్రేకింగ్

by vinod kumar |
లాక్‌డౌన్‌లోనూ కరోనా ఔట్ బ్రేకింగ్
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఊహించనంత వేగంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజు వ్యవధిలో దేశం మొత్తంమీద 4,987 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక రోజు వ్యవధిలో ఇంత ఎక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఇందులో 2,347 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే వచ్చాయి. మూడవ విడత లాక్‌డౌన్ ముగిసి నాల్గవ విడతలోకి మరిన్ని ఆంక్షల సడలింపుతో ప్రయాణిస్తున్న సమయంలో ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం, వలస కార్మికులకు కూడా గణనీయ సంఖ్యలోనే పాజిటివ్ నిర్ధారణ కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ వలస కార్మికులకు తగిన పరీక్షలు చేసి క్వారంటైన్‌లో ఉంచుతున్నా పాజిటివ్ నిర్ధారణ అవుతూనే ఉంది. ఆదివారం ఉదయం నాటికి దేశం మొత్తంమీద కరోనా కేసుల సంఖ్య 90,927కు చేరుకుంది. గడచిన 24 గంటల వ్యవధిలో 119 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 2,872కు చేరుకుంది. చికిత్స అనంతరం ఒక్క రోజులోనే 3,956 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 34,109కు చేరుకుంది.

దేశంలోని మొత్తం కేసుల్లో దాదాపు మూడవ వంతు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇక్కడ ఒక రోజు వ్యవధిలో 2,347 కొత్త కేసులు నమోదైతే ఇందులో 1,571 కేసులు ముంబాయి నగరంలోనే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు కరోనా కారణంగా 1198 మంది చనిపోతే ముంబాయి నగరంలో 734 మంది చనిపోయారు. తమిళనాట ఇంకా మూడంకెల స్థాయిలో కేసులు నమోదవుతున్నా వారం రోజుల నుంచి కొత్త కేసులు తగ్గుతున్నాయి. మొత్తం కేసుల్లో దాదాపు సగం మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండంకెల స్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయి. ఇందులో వలస కార్మికులు కూడా ఎక్కువే ఉంటున్నారు. తెలంగాణలో 42, ఆంధ్రప్రదేశ్‌లో 25 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

భారత్ :

మొత్తం కేసులు : 90,927
రికవరీ : 34,109
మృతులు : 2,872

తెలంగాణ :

మొత్తం కేసులు : 1,551
రికవరీ : 992
మృతులు : 34

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 2,230
రికవరీ : 1,433
మృతులు : 50

Advertisement

Next Story

Most Viewed