ఒక్క వైరస్.. భిన్న లక్షణాలు… కారణం ఇదే!

by sudharani |
ఒక్క వైరస్.. భిన్న లక్షణాలు… కారణం ఇదే!
X

టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది, మెరుగైన వైద్యం కోసం మంచి సాంకేతికత సహాయం తప్పనిసరి అయింది. దాదాపు ఎంతటి రోగాన్నైనా గుర్తించి, బాగు చేయగల పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అయినప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తున్నా ఇంకా సరైన చికిత్స గానీ, మందుగానీ అభివృద్ధి చేయలేకపోతున్నాం. మందు తయారు చేయాలంటే ఆ వైరస్ ప్రవర్తన గురించి అర్థం చేసుకోవాలి. ప్రతీ వైరస్ మానవ శరీరం మీద తనదైన శైలిలో ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకంగా ఒక శరీర భాగం మీద దాడి చేసి అందుకు తగ్గ లక్షణాలు చూపిస్తుంది. కానీ కరోనా వైరస్ విషయంలో అలా జరగడం లేదు. కనపడిన ప్రతి భాగాన్ని తన సొంత ఇల్లులాగ చేసుకుని ఏ లక్షణం వీలైతే ఆ లక్షణాన్ని బయటపెడుతోంది. దీంతో దీన్ని గుర్తించడం శాస్త్రవేత్తలకు కాస్త ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిశోధనల్లో భాగంగానే ఒక కొత్త విషయం బయటపడింది. ఇప్పటివరకు కరోనా వైరస్‌ను శ్వాసకోశ ఇబ్బందులు కలిగించే వైరస్ కోవలోకి చెందినది అనుకున్నారు. కానీ ఇది రక్తనాళాల మీద ప్రభావం చూపించే వైరస్ అని ఇటీవల తెలిసింది. రక్తనాళాలు శరీరంలోని ప్రతి భాగంలో ఉంటాయి. అందుకే వాటిని ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణ ఇబ్బందులు కలిగి భిన్న లక్షణాలు బయటపడుతున్నాయని పరిశోధనలు చేస్తున్న ఏంజియో జెనిసిస్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ విలియం అంటున్నారు.

సార్స్ కోవకు చెందిన వైరస్‌లన్నీ ఇన్‌‌ఫ్లూయెంజా వైరస్‌లే, అంటే అవి ఊపిరితిత్తులు, శ్వాసకోశ నాళాల మీద ప్రభావం చూపించి జలుబు, దగ్గు, జ్వరం వచ్చేలా చేస్తాయి. అయితే కరోనా వైరస్ మాత్రం ఊపిరితిత్తులను దాటేసి రక్తనాళాల వరకు చేరుకోగలుగుతోంది. రక్తనాళాల్లో ఉండే ఎండోథీలియల్ కణాల మీద కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుందని బ్రిగమ్ వాస్కులర్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ మణ్‌దీప్ మెహ్రా చెప్పారు. ఈ ఎండోథీలియల్ కణాల నుంచి విడుదలైన ప్రోటీన్లే రక్తప్రసరణ నుంచి వ్యాధి నిరోధకత వరకు అన్నింటిని ప్రభావం చేస్తాయి. వీటి మీద వైరస్ దాడి చేయడం వల్ల కిడ్నీలు, హృదయం, కాలేయం, పేగులు ప్రభావితం అవుతున్నాయి. అందుకే కొవిడ్ 19 పేషెంట్లలో కిడ్నీ సమస్యలు, హార్ట్ స్ట్రోక్, కాలేయం, జీర్ణ సమస్యలు ప్రధానంగా కనిపించి, అవి తీవ్రం కావడంతో ప్రాణాలు విడుస్తున్నారని డాక్టర్ మెహ్రా వివరించారు.

ఊపిరితిత్తులలో ప్రవేశించిన తర్వాత ఈ వైరస్, వాయుగోణుల వరకు చేరుతుంది. అక్కడ కణజాలాన్ని దెబ్బతీసి ఎండోథీలియల్ కణాల్లో చేరుతుంది. తర్వాత ఏస్2 రిసెప్టర్ సాయంతో రక్తనాళాల్లో సెటిల్ అవుతుందని మెహ్రా చెబుతున్నారు. ఇక అక్కడి నుంచి ఫ్యూరిన్ అనే ప్రోటీన్ సాయంతో వైరస్ బలపడుతుంది. సార్స్ కోవకు చెందిన వైరస్‌లకు సాయం చేసే ప్రోటీన్ కేవలం ఊపిరితిత్తుల దగ్గరే దొరుకుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఫ్యూరిన్ ప్రోటీన్ శరీరంలో ప్రతి భాగంలో ఉంటుంది. అందుకే కరోనా వైరస్ ఏ భాగం పడితే ఆ భాగం మీద దాడి చేసే శక్తి పొందుతోంది. ముఖ్యంగా ఎండోథీలియల్ కణాల నాశనం వల్లనే విభిన్న లక్షణాలను కరోనా కలిగించగలుగుతోంది. అందుకే దీన్ని ఇక రక్తనాళాల వ్యవస్థ వైరస్‌గా ప్రస్తావించక తప్పదని డాక్టర్ విలియం అంటున్నారు.

Advertisement

Next Story