రాష్ట్రాలకు భారీగా ఆదాయ నష్టం..!!

by Harish |   ( Updated:2020-08-24 06:50:19.0  )
రాష్ట్రాలకు భారీగా ఆదాయ నష్టం..!!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు రూ. 3 లక్షల కోట్లకు పైగా పన్ను ఆదాయాన్ని కోల్పోయే అవకాశాలున్నాయని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భారీ అంతరాయాన్ని సృష్టించనున్నట్టు ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక వెల్లడించింది. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం.. రాష్ట్ర వ్యాట్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ వంటి విభాగాల్లో మొత్తం నెలకు ఆదాయం నష్టం సుమారు రూ. 53 వేల కోట్లు.

దీన్ని ఎస్‌జీఎస్టీలో అంచనా వేస్తే ప్రధాన రాష్ట్రాలు తొలి త్రైమాసికంలోనే రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశముంది. ఇది వార్షిక ప్రాతిపదికన రూ. 3.1 లక్షల కోట్ల నష్టాలను మిగల్చనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల పన్ను ఆదాయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏప్రిల్‌లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 32,294 కోట్లు. గతేడాది ఇదే నెలలో వసూలైన దాంట్లో 28 శాతం మాత్రమే రాబట్టాయి. మేలో జీఎస్టీ వసూళ్లు 62 శాతం తగ్గి రూ. 62,009 కోట్లకు పరిమితమయ్యాయి.

జూన్ నాటికి 91 శాతం తగ్గి రూ. 90,917 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గతేడాది వసూలు చేసిన దాంట్లో 59 శాతం మాత్రమే వసూలు చేయగలిగాయి. కొవిడ్-19 ను అధిగమించే క్రమంలో కేంద్రం రాష్ట్రాల రుణ పరిమితులను పెంచింది. 2020-21కి రాష్ట్రాల రుణ పరిమితులను 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్ల అదనపు వనరులు లభిస్తాయి. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం..20 రాష్ట్రాల్లో కేవలం 8 రాష్ట్రాలు మాత్రమే ప్రభుత్వ షరతులను నెరవేర్చే స్థితిలో ఉన్నాయి. అవి జీఎస్‌డీపీలో 2 శాతం అదనపు రుణాలను పొందవచ్చు.

రూ. 4.28 లక్షల కోట్లలో వాస్తవానికి రూ. 3.13 లక్షల కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పుగా తీసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు కలిపి గత వారాంతం సమయానికి రూ. 2.5 లక్షల కోట్లను అప్పుగా తీసుకున్నాయి. అంతేకాకుండా, కేంద్రం ఇటీవల 2019-20కి చెందిన జీఎస్టీ పరిహారాన్ని రూ. 1.65 లక్షల కోట్లను విడుదల చేసింది. దీనికోసం 2017-18, 2018-19లలో సేకరించిన సెస్ మొత్తాన్ని ఉపయోగించుకున్నారు. అంటే, జీఎస్టీ వసూళ్ల ద్వారా ఏర్పడిన ఆదాయ కొరతను భర్తీ చేసేందుకు కూడా కేంద్రం వద్ద నిధులు లేవని తెలుస్తోందై ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed