జనాలను వెంటాడుతోన్న కరోనా.. చచ్చినా చావని భయం

by Anukaran |
జనాలను వెంటాడుతోన్న కరోనా.. చచ్చినా చావని భయం
X

దిశ, సిటీ బ్యూరో: పగోడు సచ్చినా చివరగా పట్టెడు మన్నేయాలని.. చివరకు శత్రువు చచ్చినా వీడ్కొలు పలకాలంటారు పెద్దలు. ఎవరి ఇమానం, పాప పుణ్యాలు వారివే. మన మధ్య నుంచి మనల్ని వీడి తిరిగి రాని లోకాలకెళ్లే వారికి సాంప్రదాయబద్దంగా చేసే అంతిమ కార్యాలన్నీ నిర్వహించాలంటారు. కానీ, కరోనా మృతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. శ్మశానవాటికలో దహనం చేసి, ఏరి పెట్టిన అస్థికలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరు ముందుకు రావడం లేదు. మానవత్వం మాయమవుతుందనేందుకు, మానవతా విలువలు, బంధాలు మంట కలుస్తున్నాయనేందుకు ఇదో నిదర్శనం.

కరోనా వ్యాధితో మృతి చెందిన వారిని శ్మశానాల్లో కుప్పలుగా పేర్చి దహనం చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఒక్క సంజీవరెడ్డినగర్ శ్మశానవాటికలోనే లాక్ డౌన్ మొదలు, ఈ ఏడాది జూన్ రెండోవారం వరకు సుమారు 1900 వందల నుంచి 2 వేల మంది కరోనా మృతదేహాలను ఎలక్ట్రిక్, మ్యానువల్ (కట్టెలతో) దహనం చేసినట్లు శ్మశాన నిర్వాహకులు తెలిపారు. వీరిలో కేవలం16 మంది అస్థికలను కుటుంబ సభ్యులు తీసుకెళ్లి గంగలో కలిపినట్లు తెలుస్తోంది. మిగతా 450 నుంచి 500 మంది మృతుల అస్థికలు ఇక్కడే భద్రపరిచి ఉంచామని, వాటి కోసం ఎవరూ రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

అస్థికల కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా వస్తారేమోనని, ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి భద్రపరిచామని, 6-7 నెలలుగా వాటిని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. శాస్త్ర్రం ప్రకారం జరగాల్సిన అంతిమ సంస్కారానికి కూడా నోచుకోనంత పాపం ఏం చేసి ఉంటారోనని ఆలోచిస్తుంటామని శ్మశానవాటిక కార్మికులు వాపోతున్నారు.

700 డిగ్రీల ఉష్ణోగ్రతలో దహనం

శ్మశానవాటికలో ఉన్న ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలో 500 డిగ్రీల ఉష్ణోగ్రతలో మృతదేహాలను దహనం చేయాల్సి ఉండగా, అప్పట్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు రావటంతో త్వరగా దహనం చేసేందుకు 700 డిగ్రీలకు ఉష్ణోగ్రతను పెంచినట్లు కార్మికులు తెలిపారు. ఇంత గరిష్ట ఉష్ణోగ్రతలో ఎలాంటి వైరస్ అయినా కాలి బూడిదైపోతుంది. ఈ విషయం చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసి కూడా అస్థికలు తీసుకెళ్లేందుకు రాకపోవటం విచారకరం.

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ వీరు కాదా..?

కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఒక వర్గమైన ఆరోగ్యశాఖకు చెందిన వారిని గుర్తించి, వారికి ప్రోత్సాహాకాలు, అవార్డులు, రివార్డులు ఇస్తున్న ప్రభుత్వం.. ఎలాంటి నివారణ ప్రమాణాల్లేకపోయినా, ప్రాణాలకు తెగించి మృతదేహాలను దహనం చేసిన కార్మికులను ఇప్పటి వరకు గుర్తించకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 700 డిగ్రీల ఉష్ణోగ్రతలో దహనం చేసిన తర్వాత కనీస అస్థికలను ముట్టుకునేందుకు కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్థితుల్లో.. తాము ఎంతో ఉదార స్వభావంతో దహన సంస్కారాలు నిర్వహిస్తే, ఏ ఒక్కరు కూడా తమ సేవలను గుర్తించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story