కుత్బుల్లాపూర్‌లో కరోనా కలకలం

by vinod kumar |
కుత్బుల్లాపూర్‌లో కరోనా కలకలం
X

దిశ, మేడ్చల్: కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారితో భారత్ సహా ప్రపంచమంతా వణికిపోతోంది.
కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కాని తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఓ వ్యక్తి నిర్లక్ష్యం.. ఆ కుటుంబాన్నే కాదు.. మరో 40 మంది కుటుంబాలను కలవరపాటుకు గురి చేసింది.

వివరాల్లోకెళితే..శని, ఆదివారాల్లో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఒకే ఇంటిలో నలుగురికి కరోనా సోకినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి ఇటీవల ఢిల్లీ ప్రాంతం నుంచి వచ్చాడు. ఇక్కడ మూడు రోజుల పాటు అందరితో సన్నిహితంగా తిరిగాడు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం స్థానికంగా ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో నమాజ్ చేశాడు. ఆ సమయంలో సదరు వ్యక్తితో పాటు మరో 40 మంది నమాజ్‌లో పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు వీరందరికీ కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి కుటుంబీకులు ముగ్గురికీ కరోనా సోకింది. కాబట్టి వారందరినీ గుర్తించేందుకు అధికారులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు.

రంగంలోకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..

వైరస్ సోకిన వ్యక్తి 40 మందితో కలిసి నమాజ్ చేశారన్న సమాచారంతో అధికారులు రంగప్రవేశం చేశారు. వారి ఆచూకీ కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యుడు డాక్టర్ చరణ్ వచ్చారు. ఆ రోజు నమాజ్‌లో పాల్గొన్నది ఎవరనే దానిపై కూపీ లాగుతున్నారు. గాజులరామారం సర్కిల్ చంద్రగిరినగర్‌లో అధికార బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 8 మందిని గుర్తించి స్టాంప్ వేశారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆచూకీ లభించిన 8 మందిలో అనుమానం ఉన్న ఆరుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఒకే ఇంటిలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో గాజులరామారం ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చంద్రగిరి నగర్, రోడామేస్త్రీ నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే సోడియం ఐఫోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. ఆయా కాలనీల్లో ఎమ్మెల్యే వివేకానంద్ సైతం పర్యటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటికి రావొద్దంటూ అధికార యంత్రాంగం చెబుతోంది. మరో రెండుమూడు రోజుల్లో ఏమైనా కొత్తకేసులు బయటపడతాయా?వేచిచూడాల్సిందే.

Tags : coronavirus, covid-19, fear, Quthbullapur

Advertisement

Next Story

Most Viewed