ఆర్టీసీ పరిస్థితి ఘోరం.. ఆస్తుల అమ్మకానికి రెడీ!

by Anukaran |
ఆర్టీసీ పరిస్థితి ఘోరం.. ఆస్తుల అమ్మకానికి రెడీ!
X

దిశ, న్యూస్‌బ్యూరో : టీఎస్​ఆర్టీసీకి ప్రభుత్వం గతంలో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ నిధులు నిండుకుంటున్నాయి. గతేడాది సమ్మె తర్వాత బస్సు చార్జీలను పెంచి ప్రయాణికుల మీద భారం మోపిన సంస్థ ఆర్థికంగా గాడిన పడుతుందనుకున్నారు. అయితే కరోనా పుణ్యమా అని ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కరోనా కట్టడి కోసం సర్కారు మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయడంతో సమారు 58 రోజుల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అనంతరం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మే 19వ తేదీ నుంచి జిల్లాల్లో బస్సులు తిరగడం ప్రారంభమైంది. రోజుకు 10వేల దాకా తిరగాల్సిన బస్సులు కేవలం 5 వేలు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్, అంతర్రాష్ట్ర బస్సులు నేటికీ రోడ్డెక్కకపోవడంతో సగం బస్సులు ఇప్పటికీ డిపోలకే పరిమితమవ్వాల్సి వస్తున్నది. కరోనా భయంతో బస్సు ఎక్కడానికి ప్రజలు వెనుకంజ వేస్తుండడంతో ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 40 శాతానికి మించకపోవడమే అతి తక్కువ ఆదాయానికి కారణమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

12 కోట్లకు రూ. 4 కోట్ల ఆదాయం

ఆర్టీసీకీ రోజువారీ సమారు రూ.12 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం సుమారు నాలుగు కోట్లు మాత్రమే వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. దీంతో కార్మికుల నెలవారీ జీతాలకుగాను లాక్‌డౌన్ కన్నా ముందు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీతో తీసుకున్న రూ.600 కోట్ల నిధులనే సంస్థ వాడుకుంటోంది. అన్ని సెటిల్మెంట్ లు కలుపుకుంటే సంస్థ జీతాలకే నెలకు రూ.200 కోట్ల దాకా ఖర్చవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఆర్టీసీకీ ఇప్పటిదాకా ఉన్న రూ.2000 కోట్ల భారీ అప్పునకు ఏడాదికి 9 శాతం వడ్డీ చొప్పున ప్రతి నెలా రూ.15 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నిధులు కూడా ఆ రూ. 600 కోట్ల బ్యాంకు గ్యారంటీ నిధుల నుంచే సంస్థ వాడుతోందని సమాచారం. అయితే ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఆర్టీసీ ప్రభుత్వంతో పాటే సంస్థలోని 45 వేల మంది ఉద్యోగులకు సగం జీతాన్నే చెల్లిస్తూ వచ్చింది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనందున తన ఉద్యోగులకు ప్రభుత్వం జూలై నెలలో పూర్తి వేతనం చెల్లించడంతో ఆర్టీసీ సైతం ఉద్యోగులకు జూలైలో పూర్తి జీతాలు చెల్లించింది. సగం బస్సులు నడవడంతో సగం ఆదాయమే వస్తున్న సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించాల్సి వస్తుంది. దీంతో అప్పటిదాకా ఉన్న అప్పులు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కేవలం జీతాలకే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మరో 2 నెలలు సగం బస్సులు తిప్పుతూ పూర్తి జీతాలిస్తే ప్రభుత్వం ఇచ్చిన మొత్తం డబ్బులు అయిపోతాయి. దీంతో మళ్లీ సర్కారు నుంచి సాయం చేస్తే వస్తే తప్ప సంస్థ నడిచే పరిస్థితులుండవని పలు కార్మిక సంఘాల సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఆస్తులు అమ్మకమా.. సర్కారు సాయమా!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఉన్న అప్పుల వాయిదాలు చెల్లించడానికి బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్టీసీకీ రూ.400 కోట్లు రుణం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో బస్సుల్లో ఓఆర్ పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే ప్రభుత్వం బడ్జెట్‌లో సంస్థకు కేటాయించిన నిధులను విడుదల చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. రుణాల రీ పేమెంట్‌కు కేటాయించిన నిధులే కాకుండా వాటికి అదనంగా మరిన్ని నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ విడుదల చేస్తుందా..? లేదంటే సంస్థ ఆస్తుల అమ్మకం వేగవంతం చేసి నిధులు సమకూర్చుకోమని ఆదేశాలిస్తుందా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని వారంటున్నారు. ఇప్పటికే కొందరు రిటైర్ అయిన కార్మికులకు పీఎఫ్ డబ్బులు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో పెట్టామని, కరోనా ప్రభావం ఇలానే కొనసాగితే సంస్థ భవితవ్యం ఏమవుతుందో తెలియడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. అంతర్రాష్ట్ర బస్సులు తిప్పడానికిగాను ఒప్పందం చేసుకోవడానికి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ త్వరగా ముందుకు వస్తే ఆదాయం కొంత వరకు మెరుగయ్యే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కరోనా తెలంగాణ ఆర్టీసీని కోలుకోలేని దెబ్బ తీసిందని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed