పూటగడిచేదెట్లా..? కరోనాతో రోడ్డెక్కని ‘క్యాబ్‌’లు..

by Shyam |
cabs
X

దిశ, తెలంగాణ బ్యూరో : కూటికోసం కోటి తిప్పలన్నట్లు.. ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొందరు కులవృత్తులను నమ్ముకోగా మరికొందరు స్వశక్తితో ఎదిగేందుకు డ్రైవర్ వృత్తిని ఎంచుకుంటున్నారు. కార్లు ఉన్న సామాన్యులు స్వయం ఉపాధి కోసం డ్రైవర్లుగా పనిచేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. వారిపై కరోనా పిడుగు పడటంతో బతుకు బండి గాడితప్పింది. కరోనాతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో క్యాబ్ లను ఎక్కేవారు లేరు. దీంతో నెలనెలా కారు వాయిదాలు, పన్నులు చెల్లించలేక, మరో వైపు కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌లో 1.25లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లున్నారు. వారిలో ఎక్కువ శాతం ఊబర్‌, ఓలా కంపెనీలకు అనుబంధంగా వాహనాలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. క్యాబ్ లు ఎక్కువగా ఐటీ కంపెనీలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. దాదాపు 33వేలకు పైగా ఐటీ కంపెనీలు ఉండగా లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే గతేడాది మార్చిలో కరోనా విజ‌ృంభించడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అనంతరం కొంత సడలింపులు ఇవ్వడం, తిరిగి సెకండ్ వేవ్ తో మళ్లీ ప్రభుత్వం లాక్ డౌన్, నైట్ కర్ప్యూలు విధించడం, దీనికి తోడు ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో క్యాబ్ లకు పనిలేకుండా పోయింది.

మరో 18 వేల వాహనాలు, పర్యాటక రంగ సేవలో కొనసాగుతున్నాయి. ఏడాదిన్నరగా పర్యాటకరంగం స్తబ్దుగా మారడంతో వారూ ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో పనిచేసినా బుకింగ్‌లు పెద్దగా ఉండటం లేదు. వచ్చే ఆ కొద్దిపాటి మొత్తంలోనూ 30 శాతం కమీషను ఊబర్‌, ఓలా కంపెనీలు తీసుకుంటున్నాయని, దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో మిగులుబాటు కావడం లేదని పలువురు క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్‌ను 5శాతం మేర తగ్గించుకోవాలంటూ ఊబర్‌, ఓలా కంపెనీలను అభ్యర్థిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 769 మంది ట్యాక్సీ డ్రైవర్లు కరోనా బారినపడగా, వారిలో పదిమంది మృతిచెందారు.

cabs shed

కిస్తీలు కట్టలేక…

కారు తీసుకొని రోడ్డెక్కినా ఎక్కేవారు లేరు. కనీసం కూలీ గిట్టుబాటు కాకపోవడడంతో కారు కిస్తీ కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సుమారు 45వేల మంది డ్రైవర్లు తమ వాహనాలను కోల్పోయారు. మొదటి లాక్‌డౌన్‌ తర్వాత వాహన లోన్‌పై ట్యాక్సీ డ్రైవర్లకు ఆరునెలలు మారటోరియం కల్పించగా, సెకండ్ వేవ్‌తో ఉపాధిని కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు అలాంటి సౌకర్యం కల్పించలేదు. దీనికి తోడు సుమారు ఇరవై శాతం ట్యాక్సీలు ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దెకు తిరుగుతుంటాయి. వాటికి నెలకు రూ.30వేల నుంచి 35 వేల లోపు అద్దె చెల్లిస్తుంటారు. పెట్రో, డీజిల్‌ లీటరు ధర పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కిలో మీటర్ కు ఇచ్చే రూపాయలను పెంచడం లేదు. దీంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం స్పందించి కనీసం కిలోమీటరుకు రూ.17 చెల్లిస్తే ఆసరాగా నిలిచే అవకాశాలున్నాయిని పలువురు డ్రైవర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖం చాటేసిన ఓలా

ప్రధాన ట్యాక్సీ సర్వీసుల్లో ఓలా కంపెనీ ఒకటి. నగరంలో సుమారు 8 వేల మంది డ్రైవర్లను ఎంపికచేసి ఒక్కొక్కరి నుంచి రూ.30వేల నుంచి రూ.40వేలు అడ్వాన్స్ తీసుకొని కంపెనీ కార్లు ఇచ్చింది. అందులో ఒక్కొక్కరూ రోజుకు రూ.1175 చొప్పున 3.4 ఏళ్లు చెల్లిస్తే చాలని, ఆ తర్వాత ఆ వాహనం సొంతమవుతుందని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అగ్రిమెంట్ పత్రాలను మాత్రం సంబంధిత డ్రైవర్లకు ఇవ్వలేదు. ఒక్కొక్కరు సమారు 3 ఏళ్లు వాహనం నడిపారు. కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో ఆ వాహనాలన్నింటినీ శానిటైజ్‌ చేస్తామని షెడ్డుకు తీసుకురావాలని చెప్పడంతో చాలా మంది తీసుకెళ్లగా వాటిని ఇవ్వకుండా స్వాధీనం చేసుకుంది. దీనికి తోడు 3వేల రూపాయలను అడ్వాన్స్ తీసుకుంది. కార్లను ఇవ్వాలని కోరితే మరమ్మతులకే మీరిచ్చిన అడ్వాన్స్ కు మించి అయిందని ఇంకా ఇవ్వాలని పేర్కొంటున్నారని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చెల్లించిన అడ్వాన్సులో సగాన్ని తిరిగిచ్చి పొమ్మంటున్నారని ఇదెక్కడి న్యాయమని.. పేరున్న సంస్థే ఇలా మోసం చేస్తే తమకు దిక్కెవరిని తమ గోడును వెళ్లదీస్తున్నారు. నగరంలో కొన్ని కార్యాలయాలను కూడా మూసివేసిందని, అడ్రస్ కూడా దొరకడం లేదని, ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ అని వస్తుందని పలువురు డ్రైవర్లు పేర్కొంటున్నారు.

మంత్రులకు వినతులు…

ఓలా కంపెనీ చేసిన మోసంపై తమకు న్యాయం చేయాలని డ్రైవర్లు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లను కలిసి వినతులు చేశారు. జరిగిన అన్యాయంపై స్పందించాలని విజ్ఞప్తులు చేశారు. కానీ స్పందన కరువైంది. నెలలు గడుస్తున్నా సమస్యను పరిష్కారం లభించలేదు. అసలే కరోనా సమయం కావడంతో ఉపాధి లేక కుటుంబ పోషణ భారం కావడంతో మనోవేధనకు గురవుతున్నారు. ఏం చేయాలో అర్ధంకాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

డిమాండ్లు …

తెలంగాణ డ్రైవర్ల సంక్షేమ బోర్డును నెలకొల్పాలి. ప్రతి డ్రైవరు కుటుంబానికి అత్యవసర సాయంగా రూ.8,500 అందించాలి. ఫిట్‌నెస్‌ అండ్‌ రోడ్డు ట్యాక్స్‌ త్రైమాసిక చెల్లింపులను రద్దు చేయాలి. వాహన లోనుపై ఈ ఏడాది డిసెంబరు 31 వరకు మారటోరియం కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను డ్రైవర్లకు అందేలా చూడాలి. కరోనాతో చనిపోయిన డ్రైవరు కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలి. రద్దయిన డ్రైవర్ల రేషన్ కార్డులను పునరుద్ధరించాలి. ఓలా కంపెనీ తీసుకున్న కార్లు డ్రైవర్లకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. అగ్రిమెంట్లను వెంటనే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి


క్యాబ్ డ్రైవర్లు రోడ్డు ట్యాక్సుతో పాటు రెండేళ్లకొకసారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, బోర్డర్‌ ట్యాక్సు తదితర పనులు చెల్లిస్తారు. జీఎస్టీ రూపంలోనూ పన్నులు కడుతున్నాం. కరోనాతో గతేడాది మార్చి నుంచి పనులు లేవు. ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు ఓలా కంపెనీ మూడున్నరేళ్ల తర్వాత కార్లను డ్రైవర్లకు ఇస్తామని చెప్పి మాట తప్పింది. కనీసం వారికి డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా ఇవ్వలేదు. దీంతో దాదాపు 8వేల మంది డ్రైవర్లు రోడ్డునపడ్డారు. ప్రభుత్వం కంపెనీల స్థాపనకు కృషిచేస్తోంది. కానీ వాటిపై పర్యవేక్షణ చేయకపోవడంతో ఓలా లాంటి కంపెనీలో మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని డ్రైవర్లకు తిరిగి కార్లు ఇప్పించేలా చర్యలు తీసుకొని వారు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలి. లేకుంటే ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది.
– షేక్‌ సలావుద్దీన్‌, చైర్మన్‌, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ

ఓలా కంపెనీ మోసం చేసింది…


20 ఏళ్లుగా కారు డ్రైవర్ గా పనిచేస్తున్నా. ఓలా కంపెనీ మూడేళ్ల క్రితం 8వేల మందిని సెలక్టు చేసింది. రూ.30వేలు అడ్వాన్స్ కట్టాలని, రోజుకు 1175 రూపాయలు కడితే మూడున్నరేళ్ల లో కారు మీ సొంతమవుతుందని చెప్పి అగ్రిమెంట్ చేయించుకుంది. కానీ కరోనా సమయంలో కారును శానిటైజర్ చేస్తామని చెప్పి షెడ్డులో పెట్టించుకొని తిరిగి ఇవ్వలేదు. కారు సొంతమవుతుందని ఆశించా. అది నెరవేరలేదు. కనీసం ఇచ్చిన అడ్వాన్స్ ఇవ్వలేదు.
-సయ్యద్ మొయిజ్, ఓలా కారు డ్రైవర్

ఎవరిని అడగాలో అర్ధమైత లేదు…


గతేడాది కరోనా సమయంలో మీటర్ వర్క్ చేస్తాం కారును తీసుకొచ్చిషెడ్డులో పెట్టమని చెప్పడంతో పాటు రూ.3వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు. టోకెన్ ఇచ్చారు. నెల రోజులు డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. కాకపోవడంతో సనత్ నగర్ గోదాంకు, కోరమల్ కేబీహెచ్ కు వెళ్తే ఆఫీసులు లేవు. ఎవరిని అడగాలో అర్ధంకాక మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ ను కూడా కలిశాం. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని సంప్రదించాలో అర్ధంకాక మనోవేధనకు గురవుతున్నాం.
-మహేష్ కుమార్, ఓలా కారు డ్రైవర్

Advertisement

Next Story

Most Viewed