పెండ్లి చేస్తే అనుమతి ఇలా తీసుకోవాలి

by Shyam |   ( Updated:2020-07-30 23:02:03.0  )
పెండ్లి చేస్తే అనుమతి ఇలా తీసుకోవాలి
X

దిశ ప్రతినిధి, మెదక్: ఆషాడం అంటేనే పెండ్లిళ్ల సీజన్. కానీ ఈ పెండ్లిళ్ల వేడుకలు కరోనా కారణంగా కళ తప్పుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా బంధువులు పెండ్లి వేడుకల్లో పాల్గొంటారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా పరిమిత సంఖ్యలోనే బంధు మిత్రులు హాజరుకావాలని సర్కారు నిబంధనలు విధించింది. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 68 ప్రకారం మేరకు నిబంధనలు పాటించాలని, పెండ్లికి ఇరువైపుల నుంచి 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో భోజనాలు వడ్డించకూడదని ఉత్తర్వుల్లో చెబుతుండటంతో వరుడు, వధువు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అనుమతి ఇలా..

పెండ్లి పత్రిక లేదా పురోహితుడు రాసిన పత్రికతో పాటు రాత పూర్వకంగా రాసి దానికి వరుడు, వధువు ఫొటోలు జతచేసి కలెక్టరేట్ లో దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టరేట్ అధికారులు పరిశీలన చేసి ప్రొసిడింగ్ జారీ చేస్తారు. కలెక్టరేట్ నుంచి పొందిన ప్రొసిడింగ్‌తో పాటు వరుడు, వధువు తరుపున బంధువులు ఇరువైపుల వారి పది మంది చొప్పున మొత్తం 20 మంది ఆధార్ కార్డు జిరాక్స్‌లు జత చేసి ఎస్పీ ఆఫీస్‌లో అందించాలి. ఎస్పీ ఆఫీసు స్పెషల్ బ్రాంచ్ అధికారులు పరిశీలన చేసి మ్యారేజ్ పాస్ జారీ చేస్తారు. పెండ్లిళ్లకు తప్ప ఇతర ఫంక్షన్ లకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కానీ స్థానికంగా ఉండే వారు మన ఫ్రెండ్లీపోలీసులే కాదా. అందరూ దోస్తులే మేనేజ్ చేసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. జులై 29, 30, 31 తేదీల్లో, ఆగస్టు 2, 5, 7, 8, 9, 10 , 11 తేదీలలో వివాహ, గృహప్రవేశ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు.

అనుమతి తప్పనిసరి: పరమేశ్వర్, సిద్దిపేట తహసీల్దార్

పెండ్లి, ఇతర శుభకార్యాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి అందరూ సహకరించాలి. పెండ్లిలో 20 మంది కంటే ఎక్కువగా ఉండొద్దు. మాస్కులు తప్పక ధరించాలి. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed