- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హంగామా లేదు.. కారణం కరోనా
దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ బోనాలు. ప్రజలు ఈ బోనాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కానీ, ఈసారి కరోనా మహమ్మారి ప్రజలను ఈ ఉత్సవాలకు దూరం చేసింది. వైరస్ విజృంభిస్తుందన్న భయంతో అధికార యంత్రాంగం ఎలాంటి జాతరలు, ఉత్సవాలు జరుపుకోవద్దని హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో తొలి ఏకాదశి రోజున బుధవారం అంగరంగా వైభవంగా జరిగే ఉర్సుగుట్ట బీరన్న బోనాలు కళతప్పాయి. ఇక్కడ బోనాలు నిర్వహించిన తర్వాతే ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా బోనాల పండుగ షురూ అవుతుంది. కరోనా దెబ్బకు ఈ ఏడాది బోనాలు ఇండ్లలోనే సమర్పించి, కేవలం దర్శనాలు మాత్రమే చేసుకోవాలని ఆలయ కమిటీ సూచించింది. దాంతో భక్తులు బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు.
చారిత్రక బోనం..
వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట బీరన్న బోనాలకు చారిత్రక నేపథ్యం ఉంది. వందలాది ఏండ్లుగా ఇక్కడ బీరన్నకు బోనాలు సమర్పించే ఆనవాయితీ ఉందని చరిత్ర చెబుతోంది. నైజాం రజాకార్లు కూడా ఇక్కడ బోనాలను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని చరిత్ర కారులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న ఉర్సుగుట్ట దగ్గర తుమ్మ చెట్లల్లో రజాకార్లు మాటువేసి బోనాలు తీసుకువచ్చే మహిళలపై రాళ్లు రువ్విఅడ్డుకునే వారని, అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టారని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచే తెలంగాణలో రజాకార్లపై తిరుగుబాటు మొదలైందంటున్నారు.
హంగామా లేకుండా..
ఏటా తొలి ఏకాదశి రోజున వరంగల్ ఉర్సుగుట్ట బీరన్న బోనాలు హైదరాబాద్ మహంకాళీ ఉత్సవాలను తలపించే రీతిలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. మహిళలు ఇంటింటా సంప్రదాయ పద్ధతిలో బోనాలు తయారు చేసుకుని బీరన్న స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటారు. నగరంలోని కరీమాబాద్, ఉర్సు, రంగశాయిపేటలో బోనాలతో మహిళలు మొక్కులు సమర్పించుకునేందుకు ఆలయం వద్దకు వస్తుండగా బీరన్నల డోలు వాయిద్యాలు, ఆట పాటలతో విన్యాసాలు, పోతురాజుల చిందులు, మేకపోతుల గాంభీర్యం, శివసత్తుల పూనకాలతో తలపై బోనాలతో వస్తుండగా ఆ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. కానీ, ఈసారి ఆ హంగామా అంతా లేకుండానే పండుగ ప్రారంభమైంది. బోనాలను స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. కానీ, ఆలయ కమిటీ సూచనల మేరకు భక్తులు ఎవరికి వారు ఇండ్లలోనే బోనాలు చెల్లించుకుంటున్నారు. పూజారి మాత్రమే ఆలయంలో పూజలు చేసి స్వామి వారికి భక్తుల తరఫున మొక్కులు చెల్లించారు.