ఆశగా అడ్డాకూలీలు..!

by Shyam |
ఆశగా అడ్డాకూలీలు..!
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ సకల వర్గాల ప్రజలను తీవ్రంగా దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించడంతో ఎక్కడికక్కడే పౌర సేవలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల కార్యకలాపాలు అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. రోడ్లపై పోలీసు కర్ఫ్యూను మించిన వాతావరణం తలపిస్తోంది. ఈ పరిస్థితిలో ఇల్లు, భార్యా పిల్లలు కలిగిన్నోళ్ళు ఏదో ఒకలా నెట్టుకొస్తారు. కానీ, కుటుంబం తోడు లేకుండా, ఉండడానికి నివాసంలేని వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. హోటళ్లలో కప్పులు కడుగుతూ, లేదంటే ఏదో రోజువారీగా అడ్డా కూలీలుగా బతుకుతూ రాత్రయ్యే సరికి బస్టాండ్లు, ఫుట్‌పాత్‌పై కాలం వెల్లబుచ్చే అభాగ్యులు మన భాగ్యనగరంలో అనేకమంది ఉన్నారు. కరోనా ప్రభావంతో యావత్తు రాష్ట్రం లాక్‌డౌన్ కావడంతో వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా శాసనసభ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఈ అభాగ్యులు ఎవరైనా పనికి పిలుస్తారేమోననే ఆశతో పొద్దుగాల్నే అడ్డమీదికి వచ్చి ఎదురు చూస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలు లేకపోవడంతో వీరికి నోట్లోకి ముద్ద పోవడం చాలా కష్టంగా మారింది. ఆసుప్రతుల వద్ద దాతలు అందించే అన్నం కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకున్న కొంతలోనే సగం ఇప్పటికీ, మిగతా సగం రాత్రికి దాచుకోవాల్సి వస్తోంది. పొరపాటు ఎవరైనా వీరున్నచోట కాసేపు అలా ఆగితే, ఏమైనా పని చేయడానికి కూలీలు కావాల్నేమో అంటూ గంపెడాశతో ఒకేసారి గుమిగూడి పనివాళ్ళు కావాల్నా సార్.. అని దీనంగా అడుగుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తమ బాధలను పట్టించుకోవాలని ఈ అభాగ్యులు కోరుతున్నారు.

Tags: corona effect, hyderabad, daily labour

Advertisement

Next Story

Most Viewed