కరోనాతో ఆగిన బడుగుల బతుకుబండి

by vinod kumar |   ( Updated:2020-04-03 22:33:16.0  )
కరోనాతో ఆగిన బడుగుల బతుకుబండి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కారు చక్రం కదిలితేనే, వారి బతుకుబండి సాగుతుంది.. కానీ, కరోనా అడ్డుకుంది! కిస్తీలు చెల్లిస్తేనే, ఫైనాన్స్ సంస్థలతో కుస్తీ తప్పుతుంది.. కానీ, కరోనా జబర్దస్తీ చేసింది! టిఫిన్లు అమ్ముకుంటేనే, వారి పొట్టనిండుతుంది.. కానీ, కరోనా వారి కడుపుగొట్టింది! పల్లీలు విక్రయిస్తేనే, వారికి రేపటిపై మళ్లీ ఆశలు.. కానీ, కరోనా వాటిని గల్లంతు చేసింది! ఆలుమగలు పనిచేస్తేనే, వారి పిల్లల పోషణ.. కానీ, కరోనా వారిని ఆగమాగం చేసింది!

పైసా పుడితేనే, వారి బతుకులు చెల్లుబాటు అవుతాయి.. కానీ, కరోనా చెల్లనికాసు చేసింది! అంతేనా.. బడుగులపై కరోనా పిడుగు అయింది! లాక్‌డౌన్.. వారి బతుకుదెరువును షట్‌డౌన్ చేసింది! చిరు వ్యాపారులు, చిన్నా, చితక పనివారలు… బతుకుజీవుడా… అంటూ అవస్థలు పడుతున్నారు. కదిలిస్తే వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. పలకరిస్తే… రేపటిపై బెంగతో పలవరిస్తున్నారు. కరోనా.. లాక్‌డౌన్.. సామాన్య జనజీవనాన్ని ఎలా అతలాకుతలం చేసిందో ‘దిశ’ ప్రత్యేక కథనం..

‘రోజూ పొద్దుగాల్నే రింగు రోడ్డు మీద టిఫిన్ సెంటర్ పెట్టుకుని కుటుంబాన్ని గడుపుకుంటున్న. పది రోజుల నుంచి అన్నీ బంద్ పెట్టించిండ్రు.. డెయిలీ చిట్టీ కట్టుకునేవాళ్లం. పది రోజుల నుంచి పైస పుట్టుబడి అయితలేదు. బండి సామాన్లు, ఇంటి ఖర్చులకు ఉంచుకున్న పైసలు కూడా అయిపోయినవి. ఇంక పొడగిస్తరని అంటుండ్రి.. అప్పటిదాకా ఎట్లా బతకాలో తెలవట్లేదు’ ఇదీ వరంగల్ నుంచి వచ్చి ఉప్పల్ రింగ్‌రోడ్డులో టిఫిన్ సెంటర్ నడుపుకునే నర్సింహులు ఆవేదన.

‘సొంత కాళ్ల మీద నిలబడదామని దోస్తుల దగ్గర కొంత అప్పు తెచ్చిన.. ఫైనాన్స్‌లో కారు కొని హైటెక్ సిటీలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో నడుపుతున్న.. మూడు నెలల దాకా ఆఫీసులు తెరవరని చెబుతుండ్రు.. ఫైనాన్స్ కట్టకపోయినా మిత్తీ పడుతుందని అంటున్నారు. మా దగ్గరి దోస్తులైతే రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండ్రు.. వాళ్లకు కూడా పైసలు అవసరం ఉంటది కదా.. ఏమీ చేయలేని పరిస్థితి’ ఇవీ భువనగిరి ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ హబీబ్ అవస్థలు.

వీరిద్దరు కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటివారు హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు, సొంత కాళ్ల మీద బతుకుదామని దొరకినకాడల్లా అప్పులు తెచ్చి చిన్న వ్యాపారాలు పెట్టుకున్నవారంతా వ్యాపారాలు సాగక అవస్థలు పడుతున్నారు. అప్పులవాళ్లకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకు మొహాలే తెలియని తమకు ఫైనాన్స్ కంపెనీలు లోన్లు ఎలా ఇస్తాయి సారూ.. అంటున్నాడు బీరప్పగడ్డ వైన్స్ ఎదుట మిర్చిబండి నడుపుకునే సాయిలు.
లాక్‌డౌన్‌తో ఐటీ కంపెనీలు, ప్రైవేటు స్కూళ్లు, సంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. నేరుగా వాటిల్లో పనిచేయకపోయినా వారందరికీ అనుసంధానంగా బతికేవారికి ఇప్పుడు బతుకుదెరువు దూరమయ్యింది. నగర వీధుల్లో ఉదయం పూట సైకిల్ మీద తిరుగుతూ ఏ టిఫిన్ అయినా రూ.10కే అమ్మే వారి దగ్గర నుంచి ఐటీ కంపెనీల్లో అద్దెకు కార్లు నడుపుకునేవారి వరకు అందరికీ కష్టాలే. ఎవరిని కదిలించినా తమను పట్టించుకునేవారు కనిపించడంలేదని, ఇలాగే నెలలు గడిస్తే కుటుంబంతోపాటు చావాల్సిందేనంటున్నవారి బాధలు, కడగండ్లు వింటే కన్నీళ్లు రాకమానవు. ఉదయం పూట టిఫిన్లు, సాయంత్రం మిర్చిబజ్జీలు వేసుకుని కుటుంబాన్ని నడిపించేవారు ఒక ఉప్పల్ ఏరియాలోనే పదివేల వరకు ఉంటారు. వైన్స్‌షాపులను ఆశ్రయించి పల్లీలు, శనిగలు అమ్ముకునేవారు, నాన్ -వెజ్ స్నాక్స్ చేసి అమ్ముకునేవారితోపాటు వీధుల్లో ఐస్ క్రీంలు అమ్మేవారి ఆచూకీ కనబడకుండా పోయింది. వీరు అమ్మనూ లేరు. అమ్మినా కొనేందుకు ఎవరూ వచ్చే పరిస్థితీ లేదు. చదువు పెద్దగా లేకపోయినా ఏదో ఓ పనిచేసుకుని బతుకుదామనుకున్న వారిపై లాక్‌డౌన్ బండ పడింది. వీధి వ్యాపారులు చేసుకుంటూ బతికే వీరంతా డెయిలీ ఫైనాన్స్ మీద దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ సాయంత్రం ప్రైవేటు వ్యాపారులకు కిస్తీలు తప్పకుండా కట్టాల్సిందే. పది రోజులుగా వ్యాపారం లేదంటే వారు ఊరుకోరు. ఓ వైపు అవి చెల్లించుకుంటూ మరోవైపు కుటుంబాన్ని నడిపించాలంటే రోజూ ఏడుపు తప్ప తమకు ఏం మిగలలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్లల్లో తిరిగినోళ్లం.. అమ్ముకోవాల్సి వస్తదేమో..

ఊర్ల ఏం పనిచేస్తమని తెలిసిన వారందరి దగ్గర అప్పులు తెచ్చి కార్లు కొనుక్కుని ఎంగేజ్ చేసుకున్నవారైతే ఆత్మహత్యలు తప్పవని భయపడుతున్నారు. కంపెనీ, కారు, బస్ కెపాసిటీని బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ కంపెనీలు చెల్లిస్తాయి. డ్రైవర్ జీతం, వెహికల్ మెయింటెన్స్ కలుపుకుంటే రూ.30వేలు పోయినా మిగిలిన వాటితో ఫైనాన్స్, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆదాయం పోవడంతో నెలకు రూ.20 వేల వరకూ ఈఎంఐ ఎలా చెల్లించాలో తెలియడం లేదు. ప్రతీ నెలా వచ్చే మొత్తం అప్పటికే అయిపోతుందని, మూడేండ్లు కష్టపడితే కనీసం బండి మిగులుతుందనే కొంచెం రిస్క్ చేసినా, ఆ ధైర్యం ఇప్పుడు లేదని ట్యాక్సీ కార్ డ్రైవర్లు బాధపడుతున్నారు. లాక్‌డౌన్ ఇలాగే కొనసాగితే ఒకేసారి రెండు లక్షల వరకూ తమపై భారం పడుతుందని, అంత అప్పు ఇప్పుడు తమకెలాగో పుట్టదు. అప్పులోళ్లు, ఫైనాన్స్ కంపెనీలు కార్లు గుంజకుపోతాయి. అప్పట్లో కార్లల్లో తిరిగిన తాము ఎవరికీ ముఖం చూపించలేము. కనీసం ఈ రోజుల్లో బతకడం కూడా కష్టమేనని, పడుకున్నా నిద్రపట్టని
పరిస్థితుల్లో వారున్నారు.

వేడి నీళ్లకు చన్నీళ్లుంటేనే బతుకుడు కష్టం

ఈనాటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నడపాలంటే ప్రతి నెలా కనీసం రూ.30 వేలకుపైగానే ఖర్చవుతున్నాయి. ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, అప్పులు, బస్సు పాస్ లేదా పెట్రోల్, వైద్యం, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఇంకో రూ.పది వేలు. భార్యభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే ఇల్లు గడవడం అంతంత మాత్రం. అలాంటిది ఒక్కసారిగా వచ్చిపడిన కరోనా లాక్‌డౌన్ పేద, మధ్య తరగతి కుటుంబాల అస్తిత్వాన్ని సైతం ప్రశ్నార్థకం చేసింది. అన్నీ సరిగా నడిస్తే.. చేబదులుగానో, అప్పుగానో తీసుకుని రొటేషన్ చేసుకునేవారు. ఇప్పుడు ఎవరిల్లూ గడవడం లేదు. సాయం చేసే మనిషి దరిదాపుల్లో లేరు. కార్ డ్రైవర్ల భార్యలు ఇండ్లల్లో పనులు, టైలరింగ్, అల్లికలు వంటి ఏదో పని చేస్తూ సాయపడేవారు. టిఫిన్ సెంటర్లు, ఇతర చిరువ్యాపారుల్లో భర్తలతోపాటు భార్యలు కూడా ఏదో ఓ పనిచేసుకుంటూ సాయంగా ఉన్నారు. భర్త చిరుద్యోగం చేస్తుంటే, ఫైనాన్స్ కార్లు నడుపుతుంటే భార్యలు నర్సులు, హౌజ్ కీపింగ్, ఆయాలుగా, పిల్లలకు ట్యూషన్ల చెబుతూ కుటుంబాన్ని లాక్కొచ్చేందుకు కష్టపడుతున్నారు. ఇప్పుడు భార్యభర్తలిద్దరికీ పనిలేకుండా పోయింది. ఇద్దరు కష్టపడి భవిష్యత్‌లో పిల్లలకు కష్టం రాకుండా చూసుకుందామనుకున్న కలలు ఒక్కసారిగా తేలిపోయాయి. ఎంతో కొంత దాచిపెట్టినా అదిప్పుడు కుటుంబాన్ని బతికించుకునేందుకు బయటకు తీయక తప్పదు. ఇక అనుకోని తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటే వారి బాధ మరీ వర్ణణాతీతం. దోమలగూడకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్ళుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. రోజులో 8 గంటలు ఆక్సిజన్ పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. ప్రతినెలా రూ.5 వేల అద్దె చెల్లిస్తూ ఆక్సిజన్ అందించే మిషన్ వాడుకుంటున్నాడు. సొంతముంటే మంచిదనకుని రూ.50 వేలు ఖర్చు చేసి ఓ ఆక్సిజన్ మిషన్ కొనుగోలు చేద్దామనుకుని అద్దె మిషన్ వాపస్ ఇచ్చాడు. కానీ, లాక్‌డౌన్ విధించడంతో కొనుగోలు నిర్ణయం వెనక్కి తీసుకోక తప్పలేదు. చేతులోని డబ్బులు అన్నీ ఒకేసారి ఖాళీ చేస్తే మరో సమస్య రావొచ్చనే భయంతో ఆలోచన మానుకున్నాడు. మళ్లీ అద్దె మిషన్‌తోనే ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాడు.

మళ్లీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది.. -ఎన్.రాజు, ప్రైవేటు కార్ ఓనర్ కం డ్రైవర్

‘మా దగ్గర బంధువుల దగ్గర అప్పులు తెచ్చి ఏడాదిన్నర కింద ఇన్నోవా కార్ కొనుక్కున్నాను. మైండ్‌స్పేస్‌లో ఓ ప్రముఖ కంపెనీలో అద్దెకు తిప్పుతున్న.. షీట్‌ను బట్టి డబ్బులు వస్తాయి. ఎన్ని రౌండ్లు కారు తిరిగితే అన్ని డబ్బులు. ఎక్కువంటే రెండు నెలలు రూ.లక్ష చొప్పున వచ్చాయి. బండి
ఎక్కువ నడిస్తే సర్వీసింగ్, టైర్లు, ఇంజన్, ఏసీ రిపేర్ల కూడా తొందరగా వస్తాయి. మళ్లీ వాటికి ఖర్చు చేయాలి. ప్రతీ నెలా వారికి ఖాతాల్లో డబ్బులు వేసేది మార్చి నెలకు అప్పుడే పది రోజుల కోతపడింది. జూన్ వరకూ ఉంటే మూడు నెలలపాటు ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా అప్పులు
కట్టక తప్పలేదు. పరిస్థితి అందరికీ తెలిసినా వారు డబ్బులు అడగక మానరు. లాక్‌డౌన్ వల్ల మళ్లీ కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. చేద్దామన్నా ఇచ్చేటోడు కూడా కనిపించడం లేదు. కారు అమ్ముకోవాల్నా.. ఏం చేయాల్నో తోచడం లేదు’

Advertisement

Next Story

Most Viewed