కరోనా మాటున సైబర్ క్రైమ్ జోరు

by srinivas |
కరోనా మాటున సైబర్ క్రైమ్ జోరు
X

కరోనా భయం మాటున సైబర్ క్రైం పడగ విప్పుతోందని ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నాయి. యావత్ప్రపంచాన్ని కరోనా భయపెడుతోంది. దీంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించాయి. దీంతో ఉద్యోగుల్లో మెజారిటీ సంఖ్య ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది.

ఇంటి నుంచి పని చేస్తుండడంతో తమ సర్వర్లు లేదా ప్రాజెక్టులకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్ వర్డ్‌లను ఉద్యోగులు వినియోగిస్తున్నారు. వీటిపైనే సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) కన్నేస్తున్నారు. వీటిని హ్యాక్ చేయడం ద్వారా ఆయా సంస్థల సర్వర్లలోకి దూరి ఆయా సంస్ధలకు చెందిన విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేస్తుండడంతో సంస్థ ఈ రకమైన చోరీని గుర్తించేందుకు సమయం పడుతుంది.

మరోవైపు కరోనా గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో సెర్చ్ ఇంజన్లలో కరోనా గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. దీనిని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. కరోనా గురించిన విలువైన సమాచారం లేదా కరోనా గురించిన ఆసక్తికరమైన సమాచారం అంటూ తమ నకిలీ లింక్‌లలోనికి నెటిజన్లను రప్పించుకుని, ఈమెయిల్స్, యాడ్స్, వైబ్‌సైట్ లింక్స్, అప్లికేషన్స్ ఓపెన్ చేసేలా చేసుకుంటున్నారు. ఆయా లింక్‌లను క్లిక్ చేయగానే ఖతాదారుకు సంబంధించిన విలువైన సమాచారం తస్కరించబడుతోంది.

ప్రధానంగా కోవిడ్ లాక్ పేరుతో పంపుతున్న లింక్‌ను క్లిక్ చేయగానే సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసి కంప్యూటర్లను బ్లాక్ చేస్తున్నారు. తిరిగి కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలంటూ బేరసారాలకు దిగుతున్నారు. దీంతో చేసిన తప్పు తెలుసుకుని నెటిజన్లు లబోదిబో మంటున్నారు. చివరగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికే పుణ్యకాలం గడిచిపోవడంతో వారికి దానిని రికవరీ చేయడానికి తలకు మించిన భారమవుతోంది.

యజోరాల్ట్ అనే లింక్‌తో నెటిజన్ వినియోగించే కంప్యూటర్‌లోనికి మాల్‌వేర్‌ను జొప్పిస్తున్నారు. దీని సాయంతో అందులోని డేటా మొత్తాన్ని చోరీ చేస్తున్నారు. ఈ మాల్‌వేర్ మూడేళ్లుగా ఇండియాలో ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో దీని నేరాలు తీవ్రమయ్యాయని గుర్తించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు దీని బారిన పడినట్టు ఫిర్యాదులందలేదని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌లో సమాచారం తీసుకోవాలని భావించేవారు అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనధికార, అసురక్షిత లింక్‌లను క్లిక్ చేయడం వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని, వాటిని కొనితెచ్చుకోవద్దని ఏపీ సైబర్ సైబర్ క్రైమ్ పోలీసులు సలహా ఇస్తున్నారు.

Tags: corona virus, covid-19, cyber crime, andhrapradesh police, inter net, social media

Advertisement

Next Story

Most Viewed