కరోనా నుంచి కోలుకోవడానికి ఏడాది పట్టొచ్చు… సర్వేలో వెల్లడి

by vinod kumar |
కరోనా నుంచి కోలుకోవడానికి ఏడాది పట్టొచ్చు… సర్వేలో వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 ప్రభావాల నుంచి కోలుకోవడానికి ప్రపంచానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పట్టొచ్చని ఓ సర్వే ద్వారా తెలిసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందర్నీ కలవరపెడుతున్న జబ్బుల్లో కరోనా వైరస్ మొదటి స్థానంలో ఉండగా, కేన్సర్, ఎయిడ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. వెలాసిటీ ఎంఆర్ అనే మార్కెటింగ్ రీసెర్చి అండ్ అనాలసిస్ కంపెనీ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. మార్చి 19, 20 మధ్య జరిగిన ఈ సర్వేలో దాదాపు 2100 మంది శాంపిల్ సైజ్ ఉంది. ఆన్‌లైన్ పోల్ ద్వారా జరిగిన ఈ సర్వేలో దాదాపు 84 శాతం మంది ప్రపంచం కోలుకోవడానికి ఏడాది పడుతుందని వెల్లడించారు.

మరోవైపు కరోనా కారణంగా పాటిస్తున్న క్వారంటైన్ వల్ల వచ్చిన మార్పులను చాలా మంది అన్వయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సర్వేలో తేలింది. 58 శాతం మంది కనీసం తమకు అత్యవసర వస్తువులు కూడా దొరకక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. ఇక 46 శాతం మంది తమకు పని కోసం ట్రావెల్ చేయక తప్పడం లేదని చెబుతున్నారు. అయితే కేవలం 25 శాతం మంది మాత్రమే తమకు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించినట్లు చెప్పడం గమనార్హం.

ఇక కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి తాము రోజుకు వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కుంటున్నామని 81 శాతం మంది చెప్పినట్లు సర్వేలో తెలిసింది. అలాగే 78 శాతం మంది గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా తమను తాము నియంత్రించుకున్నట్లు చెప్పారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచన జనాల్లో తగ్గుతుందని వెలాసిటీ ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ జసాల్ షా అభిప్రాయపడ్డారు.

Tags: Corona, COVID 19, Survey, Recovery

Advertisement

Next Story

Most Viewed