భయభ్రాంతుల నడుమ భాగ్యనగరం

by Shyam |
భయభ్రాంతుల నడుమ భాగ్యనగరం
X

దిశ, హైదరాబాద్‌: ప్రపంచాన్ని పరేషాన్ చేస్తున్న కరోనా మహమ్మారి ధాటికి హైదరాబాద్ నగరం వణుకుతోంది. దుబాయ్ నుంచి తెలంగాణకు వచ్చిన ఓ యువకునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో హైదరాబాద్ వాసుల్లోనూ ఆందోళన మొదలైంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, పార్కులు తదితర జన సమ్మర్థం అత్యధికంగా ఉండే సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఐటీ సంస్థలు ఇంటి నుంచే విధులు నిర్వహించే వెసులుబాటు కల్పించింది. ఫలితంగా నగరంలోని రోడ్లన్నీ ఖాళీగానే కన్పిస్తున్నాయి.

హైదరాబాద్ రాజధాని నగరం కావడంతో రోజూ అనేక రాజకీయ, సామాజిక అంశాలపై సభలు, సమావేశాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇందిరాపార్కు ధర్నా‌చౌక్‌లో ధర్నాలు, సభలు నిర్వహిస్తుంటారు. కానీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్నా‌చౌక్ సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ఉన్న అనుమతులనూ రద్దు చేశారు. రవీంద్రభారతి, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్, సుందరయ్య విజ్ఞాన కేంద్రాల్లో ప్రెస్‌మీట్‌లు, ఇతర కార్యకలాపాలు రద్దు చేశారు. ఇందిరాపార్కు గేటుకు ఈ నెల 31 వరకు బంద్ అంటూ నోటీస్ అంటించారు.

అసెంబ్లీ సమావేశాలు కూడా నిరవధిక వాయిదా పడ్డాయి. గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు సగానికి పడిపోయాయి. ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రిలోనూ అంతే పరిస్థితి. ఇక మెడికల్ షాపుల్లో మాస్కులు దొరకడం లేదు. మొత్తానికి కరోనా హైదరాబాద్ నగరవాసులను అతలాకుతలం చేసిందనే చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed