తెలంగాణలో 10వేలు దాటిన కరోనా కేసులు

by vinod kumar |   ( Updated:2020-06-24 10:54:04.0  )
తెలంగాణలో 10వేలు దాటిన కరోనా కేసులు
X

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేల మార్కు దాటింది. దేశం మొత్తం మీద పదివేల కేసులు దాటిన రాష్ట్రాలు ఇప్పటిదాకా ఎనిమిది ఉంటే ఒకే రోజున ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆ జాబితాలో చేరాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 891 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 719 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ప్రతీరోజూ అంతకు ముందురోజున వచ్చిన కేసుల కంటే ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 225కు చేరుకుంది. మొత్తం 4,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే అందులో 891 పాజటివ్‌గా తేలాయి. డిశ్చార్జి అవుతున్నవారితో పోలిస్తే ఐదు రెట్ల స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో వీలైనంత తొందరగా కరోనా పేషెంట్లను అడ్మిట్ చేసి చికిత్స అందించాలని భావిస్తోంది. దాదాపుగా వైద్య సిబ్బంది నియామకం పూర్తికావడంతో ఇక వారికి బాధ్యతలు అప్పగించడమే తరువాయి అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

కొత్త కేసులన్నీ దాదాపు హైదరాబాద్ నగరంలోనే

రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులో 891 కొత్త కేసులు నమోదైతే జీహెచ్ఎంసీ పరిధితో పాటు నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55 చొప్పున నమోదయ్యాయి. సంగారెడ్డి, వరంగల్ రూరల్, అర్బన్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, కొత్తగూడెం, సిసిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నల్లగొండ, నిజామామాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో సింగిల్ డిజిట్‌లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడకుండా ఉన్న జిల్లా ఒక్కటి కూడా లేదు. కరోనా కేసులకు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పరీక్షలు ఎక్కువ చేస్తున్నాకొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రంలో మొత్తంగా 67,318 కరోనా టెస్టులు జరిగాయి. ఇందులో 10,444 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 4,361 మంది డిశ్చార్జి కావడంతో ఇంకా 5,858 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story