- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కరోనా.. రెండ్రోజుల్లో ఏం జరగబోతోంది?
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో రానున్న రెండు రోజులు చాలా కీలకం కానున్నాయి. ఈ రెండు రోజుల్లో నమోదయ్యే కొత్త కేసులపైనే ప్రభుత్వం లోతుగా దృష్టి పెట్టింది. విదేశాల నుంచి వచ్చినవారు, ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నవారు, ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు.. ఇలా వివిధ కోణాల్లో వైరస్ రావడానికి ఆస్కారం ఉన్న అన్ని దారులకూ ఈ నెల 7వ తేదీ నాటికి 14 రోజుల గడువు పూర్తవుతుంది. ఇలా వెళ్ళివచ్చినవారిలో ఇప్పటికే వైరస్ లక్షణాలు ఉన్నవారు ఐసొలేషన్‌లో ఉన్నారు. రైళ్ళు, బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఒక చోటి నుంచి ఇంకో చోటకు వైరస్ వ్యాపించే అవకాశమూ లేదు. అయితే విదేశీ ప్రయాణం, మర్కజ్ ప్రయాణం చేసివచ్చినవారి ద్వారా వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితంగా ఉంటున్నవారి (సెకండరీ లేదా థర్డ్ లెవల్)కి మాత్రమే లక్షణాలు సోకే అవకాశం ఉంటుంది. ఇకపైన కొత్త కేసుల తీవ్రత వచ్చే రెండు రోజుల్లో మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందనేది ప్రభుత్వ భావన. అందుకే ఈ రెండు రోజులు పూర్తిస్థాయిలో కష్టపడితే ఆ తర్వాత తీవ్రత గణనీయంగా తగ్గుతుందని, ఆందోళన కూడా తగ్గిపోతుందని అభిప్రాయపడుతోంది.
ఈ రెండు రోజుల్లో నమోదయ్యే పాజిటివ్ కేసుల ఆధారంగా తెలంగాణలో కరోనా తీవ్రత ఎంత ఉంటుందో ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది. ఇప్పటివరకూ ప్రభుత్వం రూపొందించిన ఎత్తుగడలకు భిన్నంగా ఇకపైన ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 7వ తేదీ నాటికి కొత్త కేసులేవీ నమోదుకాకుంటే ఇక కరోనాకు బ్రేకులు పడినట్లేనని, ‘కరోనా-ఫ్రీ తెలంగాణ’గా రాష్ట్రం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం రోజుల క్రితం ప్రకటించారు. ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా ఈ నాలుగైదు రోజుల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదై శనివారం రాత్రి సమయానికి మొత్తం కేసుల సంఖ్య 272కు చేరుకుంది. ఇంకా సుమారు 800 నమూనాల రిపోర్టు రావాల్సి ఉన్నందున కొత్త పాజిటివ్ కేసులకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు శ్రీకారం చుడుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించిన ఏప్రిల్ 7వ తేదీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఆ తర్వాత ఏం జరగబోతుంది? కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని ధైర్యంగా ఉండవచ్చునా? అంటే రెండు రోజుల తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. మర్కజ్ అంశమే లేనట్లయితే తెలంగాణ పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వైరస్ విదేశాల నుంచి వస్తోంది కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వాలు. కానీ నిజాముద్దీన్ మర్కజ్ అంశం తెరపైకి వచ్చేంతవరకూ అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అంచనా వేయలేకపోయాయి. అందువల్లనే జాతీయ, రాష్ట్ర స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య అంచనాకు అందకుండా వేగంగా పెరిగిపోయింది. ఏప్రిల్ 7వ తేదీ తర్వాత డైరెక్టు కేసుల సంఖ్య తగ్గిపోతుంది. ఇకపైన దృష్టి పెట్టాల్సింది కాంటాక్టు కేసులపైనే అనేది ప్రభుత్వ వ్యూహం. ఏప్రిల్ 7వ తేదీకి ఉన్న ప్రాధాన్యతను పరిశీలిద్దాం.
ఏప్రిల్ 7.. చాలా కీలకం..
ఏప్రిల్ 7వ తేదీకి నాలుగైదు కోణాల్లో ప్రాధాన్యత ఉంది. డాక్టర్ల విశ్లేషణ ప్రకారం కరోనా వైరస్ ఉనికి 14 రోజులు. ఆ సమయాన్ని వైద్య పరిభాషలో ‘ఇన్‌క్యుబేషన్ పీరియడ్’గా పరిగణిస్తున్నారు. కరోనా వైరస్ కలిగిన వ్యక్తిలో వ్యాధి లక్షణాలు నాలుగైదు రోజుల నుంచి మొదలై 14 రోజుల లోపు బైటపడతాయన్నది డాక్టర్ల భావన. ఈ పద్నాలుగు రోజుల్లో లక్షణాలేవీ రాకుంటే ఆ వ్యక్తి వైరస్ బారిన పడలేదనే అంచనాకు వస్తారు. కరోనా వైరస్ విదేశాల నుంచి వచ్చింది కాబట్టి గత నెల 22వ తేదీ నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రైళ్ళు, బస్సులు, ప్రైవేటు వాహనాలు కూడా ఆగిపోయాయి. విదేశాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వైరస్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి 15 రోజులైనందున కొత్తగా వైరస్ రావడానికి ఆస్కారమే లేదు.
అప్పటికే విదేశాల నుంచి వచ్చినవారికి వైరస్ లక్షణాలు బైటపడడానికి ఎలాగూ పద్నాలుగు రోజుల గరిష్ట సమయం (క్వారంటైన్) కూడా పూర్తయింది. ఈ పీరియడ్‌లో లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ అని తేలితే ఆసుపత్రికి తరలించడం, నెగటివ్ అని వస్తే మరో 14 రోజుల పాటు ముందుజాగ్రత్త చర్యగా ఇళ్ళల్లోనే స్వీయ ఐసొలేషన్‌లో ఉండమని సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చిన వారి సంఖ్యను 25,937గా నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. ఇందులో సుమారు రెండు వేల మంది మినహా మిగిలినవారందరి క్వారంటైన్ కాలం పూర్తయింది. ఆ రెండు వేల మంది పీరియడ్ కూడా ఈ నెల 7వ తేదీతో ముగుస్తుంది. వైద్యారోగ్య శాఖ, పోలీసు శాఖలకు చెందిన 5,476 బృందాలు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేదీ నాటికి మొత్తం 25,937 మంది విదేశీ ప్రయాణం చేసివచ్చినవారి క్వారంటైన్ పూర్తికానుంది. ఇక ఆ తర్వాత ఎవ్వరూ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. అందువల్ల వీరిలో ఏప్రిల్ 7వ తేదీ తర్వాత పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా స్వల్పం.
మర్కజ్ నుంచి వచ్చిన వారి సంగతేమిటి?
ఇక ఊహకు అందని విధంగా తెరపైకి వచ్చిన మర్కజ్ అంశాన్ని చూస్తే… ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ షెడ్యూలు గత నెల 13 నుంచి 15వ తేదీ వరకు జరిగింది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో దాదాపు అందరూ అక్కడి నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి వివరాలను సేకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య పరీక్షలు జరిపి పాజిటివ్‌గా తేలినవారిని ఆసుపత్రులకు తరలించాయి. కరోనా లక్షణాలు లేనివారిని క్వారంటైన్ లేదా ఐసొలేషన్‌కు తరలించి ప్రతీరోజు పరిశీలిస్తున్నారు వైద్యులు. మర్కజ్ షెడ్యూలు పూర్తయ్యి కూడా పదిహేను రోజులు దాటిపోయింది. అక్కడికి వెళ్ళివచ్చినవారికి పాజిటివ్ ఉందో లేదో ఇప్పటికే తేలిపోయింది. ఇన్‌క్యుబేషన్ కాలం అయిపోయినందున కొత్తగా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం లేదనేది వైద్యుల అభిప్రాయం. ఈ మూడు రకాలుగా వైరస్ ప్రత్యక్షంగా రాష్ట్రానికి చేరుకునే మార్గాల పద్నాలుగు రోజుల గడువు పూర్తికావడంతో దాదాపుగా మూసుకుపోయినట్లే. అందుకే మరో రెండు రోజుల్లో వచ్చే కేసులే తప్ప ఆ తర్వాత కొత్త కేసులు నమోదయ్యే అవకాశం లేదనేది వైద్యారోగ్య శాఖ అధికారుల ధీమా.
అయితే మర్కజ్ పర్యటన వివరాలను ఇప్పటిదాకా చెప్పకుండా గోప్యంగా ఉంచి కుటుంబ సభ్యులతోనే ఉన్నందున వారిలో లక్షణాలు పొడసూపే ప్రమాదం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి కుటుంబ సభ్యుల, సన్నిహితుల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి ద్వారా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఏ మేరకు వైరస్ సోకిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టి వీలైనంత త్వరగా వారిని క్వారంటైన్ లేదా ఐసొలేషన్‌కు పంపడానికి ప్రాధాన్యత ఇస్తోంది. వారి ద్వారా ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.07 లక్షల కుటుంబాల్లోని 4.45 లక్షల మంది ఆరోగ్య వివరాలను తెలుసుకుంది. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని 147 ఆసుపత్రులకు తరలించి ప్రతీరోజు రెండు పూటలా వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటూ ఉంది. ప్రస్తుతానికి విదేశీ ప్రయాణం ద్వారా వైరస్‌కు అవకాశం లేనందువల్ల, ఇతర రాష్ట్రాల నుంచి రైలు, బస్సు సర్వీసులు కూడా లేనందువల్ల ప్రత్యక్షంగా వైరస్ మోసుకురావడానికి మార్గం లేకుండాపోయింది. అయితే అలాంటివారి ద్వారా వైరస్ వ్యాపించే గడువు కూడా దాదాపు పూర్తవుతున్నందున పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లేనన్నది ప్రభుత్వ ధీమా.
అందుకే ఈ రెండు రోజుల్లో నమోదయ్యే కేసులే తప్ప ఆ తర్వాత తీవ్రత గణనీయంగా తగ్గిపోతుందని అభిప్రాయపడుతోంది. మూడవ స్టేజీలోకి వెళ్ళకుండా, ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’కు అవకాశం లేకుండా కట్టడి చేయడంలో రాష్ట్రం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనే ఇచ్చాయన్నది వైద్యాధికారుల అభిప్రాయం.
ఊహించని పరిస్థితి ఎదురైతే..
మరోవైపు ఊహించని తీరులో సెకండ్, థర్డ్ లెవెల్ కెంటాక్టు కేసులు వచ్చే రెండు మూడు రోజుల్లో బయటపడి కరోనా మహమ్మారి కమ్యూనిటీ స్ప్రెడింగ్ జరిగి భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాన్నీ కొట్టివేయలేం. అయితే, అలాంటి అవకాశాలు తక్కువేనన్నది పరిశీలకుల భావన. అలాంటి పరిస్థితి వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు సర్కారు గచ్చిబౌలి స్టేడియంను ఆసుపత్రిగా మార్చడం మొదలు 12,500 ఐసొలేషన్ బెడ్స్‌ను సిద్ధం చేసుకుంది. ఐదు లక్షల పీపీఈ కిట్లు, ఐదు లక్షల మాస్కులు, ఐదు లక్షల వైరస్ ట్రాన్స్‌మిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, నాలుగు లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు.. ఇలా భారీ సంఖ్యలో సిద్ధం చేసుకుంది. ఏ ఆందోళన ఉన్నా అది ఏప్రిల్ 7వ తేదీ వరకేనని, ఆ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకోవచ్చన్నది ప్రభుత్వం అభిప్రాయం.
Tags: Telangana, Corona, Quarantine, Flight Services, Markaz, Nizamuddin, Isolation, Positive, LockDown