కేంద్ర బృందం పర్యటన రోజు కేసులు తగ్గుముఖం

by  |
కేంద్ర బృందం పర్యటన రోజు కేసులు తగ్గుముఖం
X

దిశ, న్యూస్‌బ్యూరో: సెలవురోజుల్లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గుతోంది. పైగా కేంద్ర బృందం నగరంలో పర్యటిస్తున్న సందర్భంగా ఒక్క హైదరాబాద్ నగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. నిన్నమొన్నటి వరకూ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, వరంగల్ అర్బన్ లాంటి జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదవుతూ ఉంటే కేంద్ర బృందం పర్యటిస్తున్న సమయంలో మొత్తం కేసుల సంఖ్య, జిల్లాల్లోని పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీద 11,609 టెస్టులు చేస్తే అందులో ఇంకా 1,700 శాంపిళ్ళ రిపోర్టు రావాల్సి ఉంది. దీంతో ఫలితాలు వచ్చిన 9,909 శాంపిళ్ళలో 1,256 పాజిటివ్ నమోదయ్యాయి. అంటే దాదాపు 13% మేర పాజిటివిటీ నమోదైంది.

హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా 389 కేసులు నమోదుకాగా ఊహకు అందని విధంగా మేడ్చల్ జిల్లాలో కేవలం 34 మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 86, సంగారెడ్డిలో 74, కరీంనగర్‌లో 73, వరంగల్ అర్బన్‌లో 67, ఆదిలాబాద్‌లో 63, నల్లగొండలో 58 చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కు చేరుకుంది. ఒకే రోజున పది మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 637కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ పాజిటివ్ కేసులుంటే అందులో సగానికిపైగా 15,789 హోమ్ ఐసొలేషన్‌లోనే ఉన్నాయి.


Next Story

Most Viewed