కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా కలవరమే

by Shyam |
కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా కలవరమే
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పోలీసు శాఖకు ఇప్పుడు కరోనా వైరస్ కలవరం పట్టుకుంది. ఇప్పటి వరకూ కానిస్టేబుల్, ఆ పై స్థాయి అధికారులకే సోకిన కరోనా.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులకూ వ్యాపించింది. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే పోలీస్ శాఖలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నగరంలోని కుల్సుంపురా పీఎస్ లో కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో మరణించడం శాఖలో అందర్నీ కలవరపెట్టింది. ప్రస్తుతం ఒక్క బంజారాహిల్స్ పీఎస్ లోనే అత్యధికంగా 26 మందికి పాజిటివ్ వచ్చింది. ఎస్సార్ నగర్, చాదర్ ఘాట్, చిలకలగూడ, చిక్కడపల్లి, బాలాపూర్, టప్పాచపుత్ర, ఛత్రినాక, బహదూర్ పురా, మీర్ చౌక్, కామాటిపురా, కాలాపత్తర్​​, డబీర్ పురా, అఫ్జల్ ఘంజ్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బందికి కరోనా కేసులు నమోదు అయ్యాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో వారం క్రితం సుమారు 100 మందికి పాజిటివ్ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 180కి చేరింది. తాజాగా ముగ్గురు ఐపీఎస్లు కరోనా బారిన పడ్డారు. డీజీపీ కార్యాలయంలో సిబ్బంది ఒకరికి పాజిటివ్ తేలడంతో సంబంధిత ఉన్నతాధికారి క్వారంటైన్లోకి వెళ్ళారు. ఇటీవలే పోలీస్ అకాడమీలో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్లకు పాజిటివ్ నిర్థారణ అయ్యింది. హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేసే ఒకరికి పాజిటివ్ రాగా, సొంతూరు కరీంనగర్ జిల్లాకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులకు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కు పాజిటివ్ నిర్థారణ కావడంతో గాంధీలో చేరాడు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగుల్లో పోలీసు శాఖకు చెందిన వారే సగం మంది ఉన్నట్టు సమాచారం.

రక్షణ కల్పించే కర్తవ్యాన్ని మరువం

కరోనా నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఫలితంగా పోలీసులు సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో కుటుంబాలు ఆందోళన చెందుతున్నమాట వాస్తవమే. ప్రజలకు రక్షణ కల్పించే కర్తవ్యాన్ని ఎన్నడూ మరువం. కరోనా వ్యాధితో మరణించిన పోలీసులకు ఇతర రాష్ట్రాలు చెల్లిస్తున్న విధంగానే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డీజీపీని కోరాం.

– గోపిరెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు

Advertisement

Next Story