కేంద్రం మత్తు వదలాలి.. వంట నూనె, ఇంధన రేట్లు సగానికి తగ్గించాలి

by Shamantha N |   ( Updated:2021-07-08 07:46:43.0  )
కేంద్రం మత్తు వదలాలి.. వంట నూనె, ఇంధన రేట్లు సగానికి తగ్గించాలి
X

చండీగఢ్: చమురు, వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నా కేంద్రం మాత్రం మొద్దు నిద్ర వీడట్లేదని పంజాబ్, హర్యానా రైతులు ఆరోపించారు. ఇకనైనా మత్తు వదిలించుకుని వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరల పెరుగుదలను నిరసిస్తూ సమ్యుక్త్ కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) గురువారం ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హర్యానా, పంజాబ్‌లోని రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. పంజాబ్‌లోని మొహాలి, అమృత్‌సర్, లూధియానా, మోగా, రూప్‌నగర్‌లలో, హర్యానాలోని సోనిపట్, సిర్సా, గోహానాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

ట్రాక్టర్లతో వచ్చి రోడ్లను దిగ్భందించారు. మరికొందరు రైతులు ఖాళీ సిలిండర్లను చూపుతూ నిరసన వ్యక్తంచేశారు. రైతు నాయకుడు హర్మీత్ సింగ్ కదియన్ లూధియానాలో మాట్లాడుతూ.. దేశంలో చమురు, వంట నూనె, నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని నియంత్రించడంలో కేంద్రం విఫలమవుతున్నదని మండిపడ్డారు. మొద్దు నిద్రలో ఉన్న కేంద్రాన్ని మేల్కొలిపేందుకే ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ప్రతిరోజూ పెరుగుతున్న ఇంధన ధరలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ధరల పెరుగుదలతో రైతుల పెట్టుబడి వ్యయమూ పెరుగుతుందని వాపోయారు. ఎస్‌కేఎం పిలుపుమేరకు ఉదయం 10 నుంచి 12గంటల మధ్య ఈ నిరసనలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed