ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటులో వివాదం

by Shyam |
ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటులో వివాదం
X

దిశ, పరకాల: హనుమకొండ జిల్లా నడికూడా మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు విషయంలో వివాదం చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మహేందర్ రెడ్డి పీఎసీఎస్ ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోలు జరుపుతామని ఐకేపీ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాన్ని అడ్డుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు మాది నడికూడ మండలం, కమలాపూర్ వాళ్ళకి సంబంధం లేదు మేము ఇక్కడ ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తామంటూ ఒకరినొకరు అడ్డుకునే ప్రయత్నంలో వాగ్వివాదం చోటుచేసుకుంది.

గతంలో మండలాల పునర్విభజనలో భాగంగా పరకాల మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామాన్ని కమలాపూర్ మండలంలో విలీనం చేయడం జరిగింది. దీంతో గ్రామస్తులు మా గ్రామాన్ని నడికూడ మండలంలో కలపాలని కమలాపూర్ మండలం వద్దంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడంతో ఎట్టకేలకు వెంకటేశ్వరపల్లి గ్రామం నడికూడ మండలంలో విలీనం చేయడం జరిగింది. నాటినుంచి రెవెన్యూ పరంగా, అభివృద్ధి పరంగా ఈ గ్రామస్తులు నడికూడ మండలంలోనే కొనసాగుతున్నారు‌. సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల మాత్రం గ్రామ పంచాయతీ పాలన నిర్వహణ కమలాపూర్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రం విషయంపై ఐకెపి, పీఎసీఎస్ సొసైటీలో సభ్యులు ధాన్యం కొనుగోలు కేంద్రం మేమే ప్రారంభిస్తాం అంటే మేమే ప్రారంభిస్తాం అంటూ ఒకరినొకరు అడ్డుకునే ప్రయత్నం గందరగోళానికి దారి తీసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించి కొనుగోలు కేంద్రం సత్వరం ఏర్పాటు చేయాలని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story