గోల్కొండలో జీహెచ్ఎంసీ మేయర్ ‘చెప్పుల’ వివాదం

by Anukaran |   ( Updated:2021-07-18 12:01:52.0  )
గోల్కొండలో జీహెచ్ఎంసీ మేయర్ ‘చెప్పుల’ వివాదం
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరోసారి వివాదాస్పదం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చుపెట్టి ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆషాఢ మాసం బోనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం గోల్కొండ కోటలో జగదాంబికా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మేయర్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో చేసిన పొరపాటు విమర్శలకు దారి తీస్తోంది.

ప్రతి ఏటా తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తితో ఈ పండుగను జరుపుకుంటారు. ఇంట్లో చేసిన బోనం ఎత్తుకొని.. చెప్పులు లేకుండానే గుడి వరకు వెళ్లి అమ్మవారికి నైవేథ్యం సమర్పిస్తారు. ఇంటికొచ్చే సమయంలో బోనం ఉంటుందని చెప్పులు కూడా ధరించరు.

కానీ, జీహెచ్ఎంసీ మేయర్ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా తొలిసారిగా మేయర్ పోస్టులో గోల్కొండకు వచ్చిన గద్వాల విజయలక్ష్మి కారులో నుంచి దిగుతూ చెప్పులు ధరించే.. అమ్మవారికి పండ్లు, పూలు, పట్టు వస్త్రాలు సమర్పించే బోనం ఎత్తుకున్నారు. ఆ తర్వాత తోటివారు గుర్తు చేయడంతో చెప్పులను వదిలారు. ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్యవహారంపై నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు. విదేశాల్లో తిరిగి వచ్చిన మేయర్‌కు మన సంప్రదాయాలు ఎలా అర్థమవుతాయని విమర్శలు చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా, పలు వాట్సప్‌ గ్రూపుల్లో ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే పలు అంశాల్లో విమర్శలు ఎదుర్కొన్న జీహెచ్ఎంసీ మేయర్‌ చెప్పుల వివాదంలో ఎలా స్పందిస్తారో అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed