ఏడాది పాటు చేపలను పెంచిన విద్యార్థులు.. తినాలా.. వద్దా..!

by vinod kumar |   ( Updated:2021-07-26 08:22:38.0  )
ఏడాది పాటు చేపలను పెంచిన విద్యార్థులు.. తినాలా.. వద్దా..!
X

దిశ, ఫీచర్స్ : ‘క్లాస్ ఆఫ్ లైఫ్’ అనేది వివిధ జపనీస్ మిడిల్ స్కూళ్ళలో ప్రవేశపెట్టిన ఒక వివాదాస్పద కార్యక్రమం. ఇందులో భాగంగా విద్యార్థులు ఏడాదిపాటు చేపలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఆ తర్వాత వాటిని తినాలా వద్దా అని నిర్ణయం మాత్రం వారిదే.

నిప్పాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సీ అండ్ జపాన్ ప్రాజెక్ట్’లో భాగంగా 2019లో ‘క్లాస్ ఆఫ్ లైఫ్’ 2019 లో జపాన్ అంతటా అనేక పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. యువ విద్యార్థులకు ‘ల్యాండ్ బేస్డ్ ఆక్వాకల్చర్‌’ నేర్పించాలనే లక్ష్యంతో ఇది మొదలైంది. ఈ యాక్టివిటీలో భాగంగా చిన్నారులు సవాళ్లను ఎదుర్కొవడంతో పాటు, జీవిత ప్రాముఖ్యత తెలుసుకుంటారని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 4 నుంచి ఆరో తరగతుల విద్యార్థులకు అనేక చిన్న చేపలను అప్పగించారు. వాటిని కనీసం ఆరు నెలలు లేదా సంవత్సరం వరకు వాటికి పరిపక్వత వచ్చేంతవరకు పెంచాలి. ఈ క్రమంలోనే పిల్లలు వాటికి పేర్లు పెట్టుకుని ప్రియమైన పెంపుడు జంతువులుగా చూస్తారు. వాటితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు.

ఒకవేళ నిర్వాహకులిచ్చిన చేపలు చనిపోతే, కొత్తవి అందిస్తారు. అయితే పిల్లలు చేసిన పొరపాటు కారణంగా చేపలు చనిపోతే, ఆ బాధాకర విషయాన్ని పిల్లలు అధిగమించడం కష్టమే అయినప్పటికీ, ప్రోగ్రామ్ ఎండ్ వద్ద వారు తీసుకోవాల్సిన నిర్ణయంతో పోలిస్తే ఇది అంతగా బాధ అనిపించదని నిర్వహకులు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా ‘క్లాస్ ఆఫ్ లైఫ్’ ప్రాజెక్ట్ పూర్తయ్యే రెండు వారాల ముందు విద్యార్థులు ఈ చేపలను సముద్రంలోకి విడిచిపెట్టాలా లేదా వండుకుని తినాలా? అన్నది నిర్ణయించుకోవాలి. అయితే మెజారిటీ పిల్లలు ‘చేపలు’ తినడానికే మొగ్గుచూపుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా పిల్లలు చేపలు తింటామన్న విషయాన్ని క్రూయిలిటీగా చూడాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. చేపలను తిన్న, తినకపోయినా పెంచడం ఆ సమయంలో తమ అనుభవాలు సవాళ్లు, ఫిష్ లైఫ్ గురించి పిల్లలకు సంపూర్ణ అవగాహన వస్తుందని, జీవిత ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వారు పేర్కొన్నారు.

జపాన్, ఇజుమోలోని ‘ఇజుమో అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్రీ’ హైస్కూల్లో కొన్ని సంవత్సరాల క్రితం ఇదే తరహా ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులోని విద్యార్థులు గుడ్లను కోడిపిల్లలుగా పొదిగించి, వాటిని పెంచి తినాలి.

Advertisement

Next Story

Most Viewed