చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా.. కాళేశ్వరంలో అంత అవినీతి జరిగిందా..?

by  |   ( Updated:2021-07-19 07:39:01.0  )
Kaleshwaram
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం పంచాయితీ తీరు అత్యంత విచిత్రంగా తయారైంది. కళ్ల ముందు భవనాలు కడుతున్నా పట్టించుకోని పాలకవర్గం .. ఉన్నట్టుండి ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. పంచాయతీ పరిధిలో చీమ చిటుక్కుమన్నా చట్టాలకు పని చెప్పాల్సిన యంత్రాంగం ఇంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడు ఇంటి యజమానులను గుర్తించి నోటీసులు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటో అంతు చిక్కకుండా పోయింది.

వార్డు సభ్యుని ఫిర్యాదుతో..

కాళేశ్వరం పంచాయతీ వార్డు సభ్యుడు శ్రీకాంత్ భూపాలపల్లి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్దంగా పనులు జరుగుతున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, భూపాలపల్లి జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. దీంతో ఈ నెల 15న కాళేశ్వరంలో విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభమైన రెండు రోజుల తరువాత 129 సర్వే నెంబర్‌లో ఇంటి నిర్మాణాలు జరిపిన ఆరుగురికి పంచాయతీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే, విచారణకు రెండు రోజుల ముందు గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శులతో హడావుడిగా రికార్డులు రాయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం గురించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కప్పిపుచ్చుకునే యత్నమా..?

అవకతవకలపై విచారణ చేపట్టిన రెండు రోజులకు నోటీసులు ఇవ్వడం వెనక ఆంతర్యం వేరే ఉందా? అన్న చర్చ సాగుతోంది. ఇంతకాలం కళ్ల ముందే జరిగిన నిర్మాణాల గురించి పట్టించుకోని పంచాయతీ యంత్రాంగం ఉన్నట్టుండి ఇప్పుడు నోటీసులు జారీ చేయడానికి కారణాలపై చర్య మొదలైంది. అధికారులు తీసుకున్న చర్యలను కప్పిపుచ్చుకునేందుకేనన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవహారంలో తల దూర్చడంతో చట్టపరమైన చర్యలకు గురి కాకుండా ఉండేందుకే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకే సర్వే నెంబర్‌తో సరా..

అయితే కాళేశ్వరం పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, విచారణ చేపట్టిన తరువాత మాత్రం ఒకే సర్వే నెంబర్‌లో నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. మిగతా ప్రభుత్వ భూములతో పాటు చెరువు శిఖం భూముల్లో కూడా నిర్మాణాలు జరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతే కాకుండా నిరుపేద దళితులకు వ్యవసాయం కోసం కేటాయించిన స్థలాల్లో కూడా పెద్దలు భవంతులు కట్టారని వాటిపై పంచాయతీ ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదో అంతు చిక్కడం లేదని అంటున్నారు స్థానికులు. కొన్ని భూముల్లో అయితే రెస్టారెంట్లు, వ్యాపారాల కోసం భవనాలు నిర్మించినా వాటిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంత కాలం ఏం చేశారో..?

పంచాయతీ పరిధిల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టిన ఖచ్చితంగా ప్లాన్‌తో సహా అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. పర్మిషన్ తీసుకోకుండా కట్టిన భవనాల కోసం పునాదులు తోడి, పిల్లర్లు వేసి, భవనాలు పూర్తయ్యే వరకూ పట్టించుకోకపోవడం ఖచ్చితంగా పాలకవర్గం నిర్లక్ష్యమేనని వార్డు సభ్యుడు శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసినందున బాధ్యులపై నూతన పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed