ఏపీపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్​

by srinivas |   ( Updated:2021-07-12 11:29:19.0  )
National Green Tribunal
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం చేపట్టుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్​గ్రీన్​ట్రిబ్యునల్‌లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ ప్రభుత్వం నుంచి సైతం పిటిషన్​ దాఖలైంది. ఇప్పటికే విచారణలో ఉన్న గవినోళ్ల పిటిషన్​తో కలిపి ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాల్సిందిగా తెలంగాణ తరఫు అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. స్వయంగా ఎన్జీటీ రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ప్రాజెక్టును నిర్మిస్తోందంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ కోర్టు విచారణ జరపాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. ఈ నెల 23న విచారించనున్నట్లు ఎన్జీటీ బెంచ్ పేర్కొన్నది.

ఎన్జీటీ గతంలో జారీచేసిన ఆదేశాల ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలు సోమవారం నివేదిక దాఖలు చేయాల్సి ఉండగా… ఏపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో నిపుణుల కమిటీ రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలన ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జైల్లో పెట్టాల్సి వస్తుందంటూ గత విచారణ సందర్భంగా ఘాటుగానే వ్యాఖ్యానించింది. దీనిపై కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ రాయలసీమ పనుల పరిశీలనను స్వయంగా పరిశీలించి, నివేదిక ఇవ్వాలని సోమవారానికి డెడ్​లైన్​ విధించింది. అయితే కేంద్ర బలగాల రక్షణ లేకుంటే ఏపీకి వెళ్లమంటూ బోర్డు ఇప్పటికే వెల్లడించింది.

అటు ఏపీ కూడా పరిశీలనకు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసింది. ఈ లోపు రెండు రాష్ట్రాల మధ్య ఈ అంశం ఘర్షణ వాతావరణాన్ని సంతరించుకోవడం, కేఆర్ఎంబీకి కొత్త ఛైర్మన్ రావడంతో అనుకున్న ప్రకారం నివేదిక తయారుకాలేదు. వచ్చే విచారణ సమయానికి ఏ మేరకు పురోగతి ఉంటుందనేది ఆసక్తికరంగ మారింది.

ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు పనులపై తమకు ప్రత్యేక దృష్టి ఉన్నదని, ఈ నెల 23న తిరిగి విచారణ జరుపుతామని బెంచ్ వ్యాఖ్యానించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారం విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ వాయిదా పడింది. తదుపరి విచారణ తేదీని ప్రకటించి తెలంగాణకు తన తరఫున అభిప్రాయాలను మాత్రం వెల్లడించింది.

Advertisement

Next Story