ఎర్రగడ్డలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం

by Shyam |
Erragadda
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదారబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. 44 ఎకరాల ఆవరణలో 1500 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు మంగళవారం మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్థల పరిశీలన చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్ తెలిపారు. చెస్ట్ సంబంధిత వ్యాధులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తామన్నారు.ఆసుపత్రితో పాటు నూతనంగా ప్రబలే పలు రకాల వ్యాధులను గుర్తించేందుకు అత్యాధునిక మెడికల్ రీసర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

మెడికల్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన కరోనా వంటి నూతన వైరస్ లు ప్రబలితే వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం ఇతర రాష్ట్రాల పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సమావేశాలు నిర్వహించేందుకు కన్వెంషన్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని తెలిపారు.

సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 18 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత చెస్ట్ హాస్పిటల్ నిర్మాణాలు ఉన్నాయని, ఇంకా 44 ఎకరాల భూమి అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇందులో అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేద ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో నగరంలో ఎప్పుడు రోగులతో రద్దీగా ఉండే గాంధీ, నిమ్స్, ఉస్మానియా వంటి ప్రధాన హాస్పిటల్స్ పై వత్తిడి తగ్గుతుందని అభిప్రాయ పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed