TRS నాయకులను టెన్షన్ పెడుతున్న కాంగ్రెస్.. ఆ జిల్లా ప్రజల్లో ఆనందం

by Sridhar Babu |   ( Updated:2021-12-08 03:30:07.0  )
mallu ravi comments
X

దిశ, భద్రాచలం : ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని అధికార టీఆర్ఎస్ పార్టీ ధీమా. అనూహ్యంగా గెలుస్తామనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు నమ్మకం. ఈ రెండు పార్టీల ప్రకటనల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. పోలింగ్ 10వ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లను మరింత కట్టుదిట్టం చేసేపనిలో నాయకులు నిమగ్నమైనారు. రెండు పార్టీల నాయకులు శిబిరాల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఓటర్లను పదిలపర్చుకొంటూ మరోవైపు తాము రచించిన వ్యూహాలు ఫలిస్తే రాబోయే క్రాస్ ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సొంత బలంపై ధీమాగా ఉండగా, కాంగ్రెస్ విపక్షాల మద్ధతుకితోడు టీఆర్ఎస్ నుంచి వచ్చే క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. అధికార పార్టీ అభ్యర్థి ఎంపికే అందివచ్చిన అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోవాల్సినంత బలం ఉన్న ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుకు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పోటీపడి ఎన్నిక (పోలింగ్) జరిగేలా చేసింది. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్ వలన ఓటర్లకు, గ్రామాలకు అనేక రకాలుగా మేలు జరిగితే ఇప్పుడు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు వలన గుర్తింపు లభించిందని ఓటర్లు, వారి కుటుంబాలు ఒకింత ఆనందిస్తున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకుంటే తమను మందలించేవారే ఉండరనేది ఎంపీటీసీలు, జడ్పీటీసీల మనసులో మాట. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి ఎలా ఉన్నా బరిలో నిలిచి టీఆర్ఎస్ పార్టీతో భారీగా ఖర్చు పెట్టించడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ శ్రేణుల్లో గుబులు పుట్టించిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతేగాక ఉమ్మడి ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల నడుమ దూరాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నిక బహిర్గతం చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ ప్రభావం మున్ముందు పార్టీపై తీవ్రంగా ఉండవచ్చు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed