అప్డేట్ అవండి మన్మోహన్ జీ : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

by Shamantha N |
అప్డేట్ అవండి మన్మోహన్ జీ : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
X

న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసమని కేంద్ర ప్రభుత్వానికి సూచనలిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని మోడీకి రాసిన లేఖపై బీజేపీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఇదే విషయమై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందిస్తూ.. లేఖలో మన్మోహన్ సింగ్ చేసిన సూచనలు తాము ఇప్పటికే అమలుచేస్తున్నామని, అప్డేట్ అవండంటూ మాజీ ప్రధానికి సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దుష్ప్రచారం వల్లే టీకా పంపిణీ సరిగా జరగడం లేదని ఆరోపించారు. మన్మోహన్ మోడీకి రాసిన లేఖకు సమాధానంగా హర్షవర్ధన్ సోమవారం మరో లేఖను విడుదల చేశారు. మన్మోహన్ సూచనలను సొంత పార్టీ (కాంగ్రెస్) వాళ్లు పాటించి ఉంటే చరిత్ర ఆయనమీద కాసింత దయ చూపేదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

కొవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ, దేశంలో కరోనా పరిస్థితులపై మీకున్న ఆందోళన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముఖ్య నాయకులకు లేదు. కరోనా వ్యాక్సిన్‌పై మీ పార్టీ వాళ్లు అసత్యాలు, అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇది ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తున్నది. ఈ కారణంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎవరికీ తెలియకుండా టీకాలు వేయించుకుంటున్నారు’ అని హర్షవర్దన్ లేఖలో పేర్కొన్నారు. లేఖలో మన్మోహన్ చేసిన సూచనలన్నీ తాము ఇప్పటికే వారం, పది రోజులుగా అమలు చేస్తున్నామని, మంచి సలహదారులను పెట్టుకోండని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన నిధులను కూడా అందజేస్తున్నామని ఆయన వివరించారు. కొవిడ్‌పై పోరులో మీ (మన్మోహన్) లాంటి వాళ్ల సహకారం అవసరమని, ఆయన ఇచ్చిన సలహాలను స్వాగతిస్తున్నామని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇదే తరహా సూచనలు, సలహాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, నాయకులకు కూడా ఇవ్వాలని మన్మోహన్‌ను కోరారు.

Advertisement

Next Story

Most Viewed