కాంగ్రెస్‌లో అటెన్షన్ అందుకేనా..?

by Shyam |
కాంగ్రెస్‌లో అటెన్షన్ అందుకేనా..?
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఆర్సీ కుంతియాను తొలగించి, ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాకూర్‌ను నియమించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అధిష్టానం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో తెలంగాణలోనూ మార్పులు అనివార్యమయ్యాయి. రాహుల్ టీం దేశవ్యాప్తంగా యాక్టివ్ అయింది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే అనేక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీసీసీ ఇన్‌చార్జి నియమితులు కావడంతో నోరు మెదపకపోవడమే మంచిదని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాతనే టీపీసీసీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మాణిక్యం ఠాకూర్ ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నందున సమావేశాలకు హాజరుకావడం అనివార్యమవుతోంది. శనివారం, ఆదివారం లాంటి సెలవులు లేకుండా ఈ నెల చివరి వరకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నందున అక్టోబరు మొదటివారంలో మాత్రమే ఆయన రాష్ట్ర పర్యటన ఉండొచ్చని ఏఐసీసీ ప్రాథమిక సమాచారం.

అప్పుడే చర్యలు మొదలు..

ఇన్‌చార్జి బాధ్యతలను లాంఛనంగా తీసుకున్న తర్వాత మార్పులు చేర్పులపై మాణిక్యం ఠాకూర్ దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితి, వివిధ పార్టీల బలాబలాలు, వాటి వ్యూహాలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమాయత్తమవుతున్న తీరు తదితరాలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత పార్టీలో సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. కొద్దిమంది సీనియర్ నేతలకు అధికార పార్టీతో లోపాయకారీ అవగాహన ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే గతంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందువల్ల అలాంటివారిని గుర్తించడం, పార్టీలో అంతర్గత గ్రూపులను కొనసాగించడం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ బలోపేతం కావడానికి అడ్డంకులు కల్పించడం.. ఇలాంటివాటన్నింటినీ చక్కదిద్ది మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టడంపైనే కొత్త పీసీసీ చీఫ్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. పార్టీని బలోపేతం చేయడం, అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా మార్పుల ప్రక్రియ మొదలుపెట్టినందున పార్టీకి ఆటంకంగా ఉండే వ్యక్తులపై, చర్యలపై కఠినంగా వ్యవహరించాలన్న స్పష్టత ఏఐసీసీ నుంచి లభించినట్లు తెలిసింది. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ గతంలో కొద్దిమంది నేతలు వ్యాఖ్యానించిందున వారిని గుర్తించే ప్రక్రియ త్వరలో మొదలు కానున్నట్లు సమాచారం.

రాహుల్‌తో సంప్రదింపుల తర్వాత..

పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, మార్పులు చేర్పులు రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతనే ఆచరణలోకి రానున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణ గురించి కూడా ఠాకూర్ దృష్టి పెట్టాల్సి ఉన్నందున గెలుపుకోసం వివిధ స్థాయి నాయకులకు బాధ్యత అప్పజెప్పడం, ఫలితాలపై విశ్లేషించడం, దానికి అనుగుణంగా అదనపు బాధ్యతలను అప్పజెప్పడమా లేక పక్కకు పెట్టడమా తదితర విషయాలపై స్పష్టత రానుంది. గులాం నబీ ఆజాద్ లాంటివారిని కూడా రోజువారీ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి సైద్ధాంతిక అంశాలకు మాత్రమే పరిమితం చేసిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా ఆ తరహా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed