ఓరుగల్లులో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. నయా జోష్‌లో క్యాడర్..!

by Anukaran |   ( Updated:2021-08-11 08:44:18.0  )
Revanth-reddy
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ద‌ళిత దండోరా నినాదంతో ఇంద్రవెల్లిలో నిర్వహించిన స‌భ స‌క్సెస్ కావ‌డంతో రాష్ట్రంలోని మిగ‌తా జిల్లాల్లోనూ బ‌హిరంగ స‌భ‌ల నిర్వహ‌ణ‌కు అధిష్ఠానం ఆస‌క్తి చూపుతోంది. అసెంబ్లీ, పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌హిరంగ స‌భ‌ల నిర్వహ‌ణ‌కు సంబంధించి స‌మ‌న్వయ క‌ర్తల నియామ‌కం కూడా పూర్తి చేయడం గ‌మ‌నార్హం. ఈ నెల 18న‌ ఇబ్రహీంపట్నంలో మ‌రో బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి స‌భలోనే ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ మూడో భారీ బ‌హిరంగ స‌భ‌కు వ‌రంగ‌ల్ జిల్లా వేదిక కాబోతున్నట్లుగా ఆ పార్టీ ముఖ్య నేత‌ల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో వ‌రంగ‌ల్ ప‌ట్టణానికి ఆనుకుని ఉన్న హ‌స‌న్‌ప‌ర్తిలో ల‌క్ష మందితో భారీ బ‌హిరంగ స‌భ నిర్వహణకు ప్రయ‌త్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అన్నీ అనుకున్నట్లుగా జ‌రిగితే ఈ స‌భలో రాహుల్‌గాంధీ కూడా పాల్గొంటార‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.

మూడు జిల్లాల‌పై ఎఫెక్ట్ ఉండేలా…

వ‌రంగ‌ల్‌లో బ‌హిరంగ స‌భ నిర్వహించాల‌నే దానిపై మ‌రి కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది. బ‌హిరంగ స‌భ‌ల నిర్వహ‌ణకు సంబంధించి పార్టీ నాయకుల‌తో కూడిన క‌మిటీ అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుంద‌ని వ‌రంగ‌ల్ నాయ‌కులు చెబుతున్నారు. అయితే వ‌రంగ‌ల్‌లో స‌భ పెట్టాల‌ని నిర్ణయం తీసుకుంటే ఖ‌చ్చితంగా అత్యంత భారీగా ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లా, క‌రీంన‌గ‌ర్‌, సిద్ధిపేట జిల్లాల నుంచి పార్టీ కార్యక‌ర్తలు హాజ‌ర‌య్యేలా.. ల‌క్ష మందితో నిర్వహ‌ణ ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇంద్రవెల్లి స‌భ సక్సెస్ అయిన త‌ర్వాత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కొంద‌ని నేత‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్‌లో స‌భ నిర్వహింప‌జేయ‌డం ద్వారా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పార్టీకి మ‌రింత వేవ్‌ను జ‌త చేసిన‌ట్లవుతుంద‌న్న యోచ‌న‌లో ఉన్నారు. ఎలాగైనా ఇక్కడ స‌భ పెట్టించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నట్లు ముఖ్య నేత‌లు వెల్లడిస్తున్నారు.

బ‌లం చూపేందుకేన‌ట‌…!

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామ‌కం త‌ర్వాత ఉత్తర తెలంగాణ‌కు గుండెకాయ‌లా ఉన్న ఓరుగ‌ల్లు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో క‌ద‌నోత్సాహం క‌నిపిస్తోంది. సీనియ‌ర్లలోనూ కొంత విబేధాలున్నా.. మెల్లగా స‌ర్దుకపోతున్నారు. టీఆర్‌ఎస్ నేత‌ల విమ‌ర్శల‌కు కౌంట‌ర్లు కూడా ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడ‌ర్‌లో న‌యా జోష్ క‌నిపిస్తోంది. ఇంద్రవెల్లి బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతమ‌వ‌డంతో పార్టీకి వేవ్ క‌నిపిస్తోంద‌ని నేత‌లు అనుచ‌రుల వ‌ద్ద బ‌లమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా జ‌న‌బ‌లం చూప‌గ‌లిగితే క్యాడ‌ర్‌లో మ‌రింత ఉత్సాహం పెంచిన‌వాళ్లమ‌వుతామ‌ని పేర్కొంటున్నారంట‌.

Advertisement

Next Story

Most Viewed