సమావేశాలకు.. ‘హస్తం’ సన్నద్ధం !

by Shyam |
సమావేశాలకు.. ‘హస్తం’ సన్నద్ధం !
X

దిశ, న్యూస్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు..కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతున్నది. శాసన సభలో, మండలిలో ఏఏ ఆంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా రైతు సంక్షేమం, కొత్త రెవెన్యూ చట్టం, ప్రభుత్వ భూముల విక్రయాలపై నెలకొన్న సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ తన అస్ర్తాలకు పదును పెడుతున్నట్టుగా సమాచారం. అంతేగాక సమావేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ప్రజా ప్రతినిధులకు పూర్తి అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 6 నుంచి 24 వరకు నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆరేండ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికలు ఏంటో ఈ సమావేశాల్లో నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీకి శాసనసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రిపేర్డ్‌గా ఉన్నట్టు సమాచారం. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు..ముఖ్యంగా ఏకకాలంలో రూ. లక్ష రైతు రుణమాఫీ అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో 194 ప్రకారం రూ.6 లక్షలు ఇవ్వాలని ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా అమలుపై, గతంలో నిరుపేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను..ప్రస్తుతం వారి నుంచి లాక్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని భావిస్తున్నారు. తద్వారా ప్రజల్లో విశ్వాసం చూరగొనే దిశగా కార్యాచరణను రూపొందించినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో..అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనలతో ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

Tags: budget, congress, trs, mla , mlc, Assembly , mandali

Advertisement

Next Story

Most Viewed