కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. పార్టీకి కౌశిక్ రెడ్డి పరోక్ష హెచ్చరిక

by Shyam |   ( Updated:2021-05-22 22:20:54.0  )
Etala Rajendar, Kaushik Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ వ్యవహారం చిచ్చు పెట్టిందా? ఈటలకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారన్న అంశం తెరపైకి వచ్చిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న ఈ తతంగంపై హుజురాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు కూడా కౌశిక్ తన ఆవేదనను వెల్లగక్కినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు ఒకరు ఈటలకు అండగా బీసీ కార్డు నినాదంతో మద్దతు పలుకుతున్నారని, దీనివల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూడాల్సి వస్తోందని కౌశిక్ రెడ్డి అంటున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ ఈటలను పక్కన పెట్టిన విషయాన్ని ఎత్తి చూపుతూ ఆయనకు మద్దతు పలకడం వల్ల నష్టం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ కౌశిక్ రెడ్డి పార్టీ కేడర్‌తో వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ఈటల తప్పిదాలను ఎత్తి చూపుతూ నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి ఇలా వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కరీంనగర్‌కు చెందిన నాయకుడు ఒకరు అంతర్గతంగా ఈటల రాజేందర్ బలహీనపడవద్దన్న వ్యూహంతో మద్దతు ఇస్తున్నారన్న విమర్శలు కూడా చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని కౌశిక్ రెడ్డి సన్నిహితులతో చెప్తున్నారు. ఎన్నికలు జరిగే నాటికల్లా అటు టీఆర్ఎస్‌ను ఇటు ఈటలను బలహీన పర్చే ఎత్తుగడలతో ముందుకు సాగాలని, వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

ఈటల రాజేందర్‌ను మంత్రి నుంచి తొలగించిన తరువాత సీఎం కేసీఆర్ లక్ష్యంగా కొన్ని రోజులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానిని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాల్సి ఉందని కౌశిక్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ఈటలకు అండగా నిలుస్తుండడాన్ని కౌశిక్ రెడ్డి తప్పు పడుతున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందని ఈటల రాజేందర్ ఆ పార్టీలో ప్రధాన చర్చకు కేంద్రీకృతం కావడం కూడా ప్రధాన చర్చగా సాగుతోంది.

Advertisement

Next Story