మోదీ.. కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే!

by Shyam |
Congress MP Revanth Reddy
X

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నల్లచట్టాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయనున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొరల కోసమే ధరణి వెబ్ సైట్ ను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారని, 150 ఏండ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములను ధరణి ద్వారా యజమానులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వదిలిన భాణం షర్మిల… తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని పునరుద్ఘాటించారు. రాజీవ్ రైతు భరోసాయాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర శనివారంతో 100 కిలోమీటర్ల మైలు రాయిని చేరింది. ఈ సందర్భంగా ఆయన ‘దిశ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి:

దిశ: ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి..?
రేవంత్ రెడ్డి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్లా చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ మొదట చెప్పారు. అందులో భాగంగానే భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన క్షణంలోనే నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రకటన చేశారు. కేసీఆర్ స్వప్రయోజనాల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలకు అంగీకరించినట్టు అర్ధమైతుంది. ముందు వ్యతిరేకించి ఆ తర్వాత మంచివి అనటంతో మోడీతో కేసీఆర్ కలిసిపోయారని స్పష్టమైయింది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేపట్టాను. ఎన్నికల కోసమో… పదవుల కోసమో కాదు. ఈ ప్రభుత్వాలు రైతులను మోసగిస్తున్న విధానాలను వివరిసు్తన్నాం. ఈ చట్టాలే కాకుండా రాష్ట్రంలోని దళితులకు మూడేకరాల భూమి, ప్రతి పేద కుటుంబానికీ డబుల్ బెడ్ రూం ఇల్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగికి భృతి లాంటి ఎన్నికల హామీలను అమలు చేయకుండా సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తున్నాం.

మీ పాదయాత్రకు పార్టీ అధిష్టానం అనుమతి ఉందా?
ఢిల్లీలో రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి మూడు నల్లా చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. అందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నాయకులు రైతులను మమేకం చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అవసరమైతే పది రోజుల పాటు పాదయాత్రలు చేపట్టి రైతులకు చట్టాలతో కలిగే నష్టాలను వివరించాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాతపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఈ పాదయాత్ర మొదలు పెట్టాను.

చట్టాలతో రైతులకు కలిగే నష్టాలు?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల అమలు చేస్తున్నామని చెప్పడానికి సీఎం కేసీఆర్ కోనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ఆ చట్టంలో ఇదొక భాగం. జొన్నలు, కందులు కోనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తున్నది. క్షేత్రస్ధాయిలో కొనుగోలు కేంద్రాలు తెరువాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని కేంద్రాలు ప్రారంభించి దిగుబడి అంచనాను లెక్కచేయకుండా ఎంతో కొంత తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో అధికారులు చేసేదేమీ లేక నిర్దేశించినంత పంట కొని తర్వాత కొనుగోలు కేంద్రాలను మూత వేస్తున్నారు. ఈవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి దారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఐకేపీ, వ్యవసాయ మార్కెట్లు ఉండవు. పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనదు. గిట్టుబాటు ధర ఉండదు. వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతు పంటను కొనుగోలు చేస్తాడు. అచ్చంపేటలో ప్రారంభించిన పాదయాత్రను ఈనెల 16న రావిర్యాలలోని అవుటర్ రింగ్ రోడ్డులో రాజీవ్ రైతు భరోసా రణభేరీ సభతో ముగిస్తాము.

కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు యాత్రలు చేయడంతో పార్టీలో విభేదాలున్నాయనే ప్రచారం సాగుతుంది.
కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ చేసే ఆరాచకాలను ఎండగట్టేందుకు ప్రజలను చైతన్యం చేసే బాధ్యత ప్రతిపక్షంపై ఉంది. మా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నాతోపాటు జగ్గారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు బీజేపీ, టీఆర్ఎస్ బాగోతాలను వివరించే ప్రయాత్నం చేస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలు గుర్తించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉందనే భరోసా కలుగుతుంది. మేము ఎంత మంది యాత్రలు చేసిన మా పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే జరుగుతాయి.

పీసీసీ చీఫ్ పదవి మీకు ఖాయమైందా?
పదవులు శాశ్వతం కాదు. కష్టపడే వారికి ఎప్పుడైనా వస్తాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో పీసీసీ చీఫ్ నియామకం నిలిపివేశారు. కానీ రేవంత్ రెడ్డిని ప్రకటిస్తారనో… వెంకట్ రెడ్డిని ప్రకటిస్తారని కాదు. నాకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ ఏ బాధ్యత అప్పగించినా మనస్ఫూర్తిగా పనిచేస్తాను.

ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉంటుంది?
మా వ్యూహం మాకు ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. గెలుపు అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటాం. సమర్థులైన చిన్నారెడ్డి, రాములు నాయక్ లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిలు పోటి చేయనున్నారు. వీళ్ల గెలుపునకు పార్టీ ఆదేశాలతో పాటు వ్యక్తిగతంగా కృషి చేస్తాను.

దిశ: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మీ పోరాటాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారా..
రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఎవరైనా తమ అభిప్రాయాలను స్పష్టం చేయొచ్చు. పార్టీ బలోపేతానికి ఏఐసీసీ అనుమతితోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్టీ నిబంధనలకు కట్టుబడి ముందుకెళ్తున్నాం.

ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వటంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నది.
ఉద్యోగులను, టీచర్లను లొంగదీసుకునేందుకే విభజించు, పాలించే సూత్రాన్ని కేసీఆర్ పాటిస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే పీఆర్సీని ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారు. ఇదే పద్దతితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాలకు తమ మద్దతు ఉంటుంది.

ధరణి వెబ్ సైట్తో రైతులకు మేలు జరుగుతుందా?
ధరణి.. దొరలకు పనికొస్తుంది. 150 యేండ్లుగా సామాన్య రైతులు సాగు చేసుకుంటున్న భూములను తిరిగి యజమానులు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీంతో వారు నష్టపోతున్నారు. సీఎం కేసీఆర్, తమ వర్గం నేతలను కాపాడుకునేందుకే ధరణి ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో 1,800 ఎకరాలను 100 యేండ్లుగా 8 తరాలు సాగు చేసుకుంటుంటే ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు.

షర్మిల పార్టీ పెట్టడంపై మీ అభిప్రాయం ఏమీటి..?
షర్మిల సీఎం కేసీఆర్ వదిలిన బాణం.. తెలంగాణ ప్రజలు ఇక్కడి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ నాయకుడు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.

Advertisement

Next Story