కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీకి మోకరిల్లారు: రేవంత్

by Shyam |   ( Updated:2023-04-13 17:50:51.0  )
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీకి మోకరిల్లారు: రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం అచ్చంపేటలో రైతు భరోసా దీక్షలో పాల్గొని అనూహ్యంగా హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టిన రేవంత్.. రెండోరోజు సోమవారం ఉప్పునూతల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళలతో మాట్లాడిన రేవంత్.. వారి బాధలను విన్నారు. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చి, యూరియా రేట్లు ఆమాంతం పెంచడంతో ఆ డబ్బులు అటే వెళ్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రేవంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు.

ఉప్పునూతల, గట్టుకాడిపల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లి వరకు ఇవాళ రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర కొనసాగనుంది. రేవంత్‌ పాదయాత్ర చేస్తుండగా కొంతమంది మహిళలు ఓ ఆటోలో కూర్చొని చూస్తుండగా వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ పెద్దలకు దోచి పెడుతున్నారని, పండించిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర రాకుండా కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని చెప్పారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ రైతులను పట్టించుకోవట్లేదని రేవంత్ విమర్శించారు.

డేరా వేసుకొని ఉంటున్న పేదల గుడిసెకు కరెంట్ మీటర్ ఏర్పాటు చేయగా.. దాన్ని పరిశీలించిన రేవంత్ ప్రభుత్వంపై దుయ్యబట్టారు. నెలకు రూ.300వరకు బిల్లు వస్తుందని, అప్పడప్పుడు రూ.350 వరకు వస్తుందని రేవంత్‌కు వివరించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిసె వేసుకొని ఉండే పేదల దగ్గర రూ.300 ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా గుడిసెకు ఎలా మీటర్ పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి గుడిసెలు గ్రామంలో చాలా ఉన్నాయని పేదలు తమ బాధను చెప్పుకున్నారు.

నాలుగు బహుళజాతి సంస్థల కోసమే ప్రధాని మోడీ 80కోట్ల మంది రైతుల్ని దెబ్బతీసే నల్లచట్టాలు తెచ్చారని, ఈ చట్టాలన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసి తర్వాత మోడీ ఎదుట కేసీఆర్ మోకరిల్లారని రేవంత్ విమర్శించారు. నల్లచట్టాలతో రైతులకు జరిగే నష్టాన్ని తెలియజేసి, రైతుల్లో చైతన్యం తెచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నామని రేవంత్ అన్నారు. అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్షలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ దీక్షలు కాకుండా పాదయాత్ర చేయాలని చెప్పడంతో రేవంత్ రెడ్డి అనూహ్యంగా.. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు.


Advertisement

Next Story

Most Viewed