టీఆర్ఎస్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మావాళ్లే- టీపీసీసీ మహిళా కాంగ్రెస్

by Shyam |
congress
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమవాళ్లేనని, వారింకా కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదని టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సునీతరావ్ మాట్లాడారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణలో విద్యార్థులు, టీచర్ల వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు స్కూళ్లు తెరవొద్దని ఆమె డిమాండ్ చేశారు.

పాఠశాలలు తెరిచేది కేవలం కల్వకుంట్ల కుటుంబం లబ్ధి కోసమేనని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యాక్సినేషన్ పూర్తి చేయకుండా ఇతర దేశాలు స్కూళ్లు తెరవలేదని, అలాంటిది తెలంగాణలో కేవలం ఫీజులు దోచుకునేందుకు తెరుస్తున్నారని సునీతరావ్ ఆరోపించారు. పాఠశాలలను ఎంపీ సంతోష్ కోసమే ఓపెన్ చేసినట్లుందన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు తామంతా అపాయింట్‌మెంట్ తీసుకొని మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశామని, అయినా తనపై కేసు పెట్టడాన్ని ఆమె ఖండించారు.

ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? అని మండిపడ్డారు. మంగళవారం ఎఫ్ఐఆర్ బుక్ చేసినా ఇంతవరకు తనకు నోటీసులు అందలేదన్నారు. హస్తం గుర్తుపై గెలిచి మంత్రి పదవిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయ్యారని అన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లేలా తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే టీఆర్ఎస్ పని పడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story