హాజీపూర్‌లో పోడు భూముల కోసం పోరాటం.. హైవే‌పై ఉద్రిక్తత

by Shyam |
హాజీపూర్‌లో పోడు భూముల కోసం పోరాటం.. హైవే‌పై ఉద్రిక్తత
X

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా హాజీపూర్ వద్ద కాంగ్రెస్‌-వామపక్షాల పార్టీలతో కలిసి.. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన నల్లమల రైతుల పోడు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ చిన్నారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారావు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్వెస్లీ, ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హాజీపూర్ చౌరస్తాలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న దళితులు, గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తే.. అప్పటి కేంద్ర ప్రభుత్వం హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాతో సహా మరో 27 మందిని వదిలేసి.. అమాయక రైతులను మోసగిస్తున్నారని విమర్శించారు.

పొడు రైతులను కేసీఆర్ మోసం చేశారు: మధు యాష్కీ

ఇదే సభలో మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. నల్లమల ప్రాంతంలో చెంచులకు భూములు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూములను సీఎం కేసీఆర్ వారికి దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నల్లమల రైతులకు హక్కు పత్రాలు ఇస్తానని నమ్మబలికిన కేసీఆర్.. నేడు పంగనామాలు పెడుతున్నారని మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు.

గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే గువ్వల ఆరాటం..

అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ.. వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని.. ఆ భూముల్లో ప్రభుత్వం సాగు చేయనీయకుండా దౌర్జన్యం చేస్తోందన్నారు. దీనిపై పోరాడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి వ్యక్తిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం జాతీయ రహదారిపై కాంగ్రెస్-వామపక్షాల నేతలు పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదం జరిగి.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed