ధాన్యం కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి ఖాయం..

by Shyam |
ధాన్యం కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి ఖాయం..
X

దిశ, దుబ్బాక : సర్కారు ధాన్యం కొనుగోళ్లను మొదలుపెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన సిద్దిపేట కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామ ఐకేపీ కేంద్రాన్నీ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామీ, నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రేపాక తిరుపతితో కలిసి ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టి పదిహేను రోజులైనా వడ్లు తూకం వేయకపోవడం బాధాకరమని, మండలంలో నామమాత్రంగా మూడు, నాలుగు రోజులకు ఒక లారీ రప్పించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. రైతు ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే టీఆర్ఎస్ నాయకులకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికే పరిమితమై రైతుల బాధలు గాలికి వదిలేశారని ఎద్దేవ చేశారు.

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రోజుల తరబడి ఎదురుచూస్తూ ధాన్యం కుప్పలపై రైతులు విగతజీవులుగా ప్రాణాలు వదులుతున్నారని అన్నారు. పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో చెప్పిన మంత్రి హరీష్ రావు.. ఎన్నికలు అయిపోగానే రైతులను మరిచిపోయారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ప్రశ్నించే గొంతు అని చెప్పుకుంటూ రైతుల పక్షాన మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదికే ప్రశ్నించే గొంతు మూగబోయిందా అని ఎద్దేవ చేశారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ఎండగడుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed