దమ్ముంటే గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేయాలి: కాంగ్రెస్

by Ramesh Goud |   ( Updated:2021-09-01 04:00:28.0  )
దమ్ముంటే గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేయాలి: కాంగ్రెస్
X

దిశ, చిట్యాల: దమ్ముంటే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి సవాల్ విసిరారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది.. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే అక్కడ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేశారని.. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేస్తేనే.. ఈ నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక సీఎం కేసీఆర్‌ వెన్నులో వణుకు పుడుతోందని.. అందులో భాగంగానే ప్రగతిభవన్ తలుపులు తెరుచుకున్నాయని ఎద్దేవా చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు దళిత, గిరిజన, బీసీ బంధు పథకాల అమలుకు ఎమ్మెల్యే కొట్లాడకపోతే గ్రామాల్లోకి రానివ్వమని హెచ్చరించారు.

చిట్యాల మండల వ్యాప్తంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం నీరుగారిపోతోందని ఒక పేద కుటుంబానికైనా ఇల్లు నిర్మించి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మండల కేంద్రంలో బస్ స్టాండు నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా.. దాన్ని ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. అందుకే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల, మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు కోటగిరి సతీష్, కుమారస్వామి, నాయకులు గడ్డం కొమురయ్య, లావుడ్యా శ్రీను నాయక్, సుదర్శన్ గౌడ్, దబ్బేట రమేష్, రవి, కోడారి సారయ్య, గుర్రం అశోక్, దాసారపు సృజన్, బుర్ర రఘు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed