కారు దిగడానికి చేయిస్తున్రు.. వాళ్లెవరంటే ?

by Anukaran |
కారు దిగడానికి చేయిస్తున్రు.. వాళ్లెవరంటే ?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్‌లో చ‌ల‌నం క‌నిపిస్తోంది. అధికార పార్టీపైకి ఎదురుదాడికి దిగుతున్న‌ట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. అధికార పార్టీ ఎత్తుగ‌డ‌ల‌ను గ‌మ‌నిస్తూనే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు నిర‌స‌న‌ల ప‌ర్వానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవ‌ల మంత్రి అజ‌య్‌కుమార్ కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న డివిజ‌న్ల‌లో ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని పేర్కొంటూ డీసీసీ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గాప్ర‌సాద్ నిరాహార దీక్ష‌కు కూర్చోవ‌డం గ‌మ‌నార్హం. అలాగే అంతకు ముందు రోజూ మ‌ధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క జిల్లా ఆస్ప‌త్రిని కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి సంద‌ర్శించారు. అనంత‌రం ఆస్ప‌త్రిలోనే స‌రైన మౌలిక వ‌స‌తులు లేవంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా నిర‌స‌న‌ల‌కు దిగుతున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న నేత‌లకు సైతం కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్య నేత‌ల నుంచి, రాష్ట్ర స్థాయి నేత‌ల నుంచి కూడా మెసేజ్‌లు అందుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో వ‌ర్గ విబేధాల‌ను ప‌క్క‌న పెడుతున్న నేత‌లు పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

ఇన్నాళ్లు.. నాయ‌క‌త్వం లేక‌..

ఖ‌మ్మం కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నిక‌ల త‌ర్వాత అంటూ చెప్పుకోవాలి. ఎన్నిక‌ల‌కు ముందు కంచుకోట‌గా ఉన్న కాంగ్రెస్ అదే స్థాయిలో ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకుంది. మెజార్టీ స్థానాల‌ను ద‌క్కించుకుంది. టీఆర్‌ఎస్‌ని కేవ‌లం ఒక స్థానానికి ప‌రిమితం చేసింది. కాని ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఖ‌మ్మం కాంగ్రెస్ బీట‌లు వారింది. ఎన్నిక‌ల్లో గెలిచి.. ఓడిన‌ పార్టీగా కాంగ్రెస్ నేడు మిగిలిపోయింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చేతి గుర్తుపై గెలిచిన నేత‌లంతా గులాబీ గూటికి చేరుకోవ‌డంతో న‌డిపించే నాయ‌క‌త్వం లేక శ్రేణులు ఆగ‌మాగ‌మ‌వుతున్నారు. న‌డిపించే నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో శ్రేణులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంత‌మందయితే పార్టీ ప‌రిస్థితి చూసి నిరాశ‌తో బీజేపీ, గులాబీ గూటికి చేరుకున్నారు. పార్టీకి జిల్లాలో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్నా ఎందుక‌నో ఇన్నాళ్లు ఏక తాటిపైకి రాలేక‌పోయారు. అయితే భ‌ట్టి మంత్రాంగం.. అధిష్ఠానం నిర్ణ‌యాలు జిల్లా కాంగ్రెస్‌లో జ‌రుగుతున్న మార్పుల‌కు సూచిక‌గా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

మ‌ళ్లీ కాంగ్రెస్ వైపు చూపు…

అంతే కాకుండా గతంలో పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన పలువురు తిగిరి హస్తం గూటికి చేరేందుకు కొంత‌మంది నేతలు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు గతంలో అండగా నిలిచిన నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరినా అటు పార్టీలో ప్రాధాన్యం గాని, నామినేటెడ్ ప‌ద‌వులు గాని ద‌క్క‌ని వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉన్న మాట వాస్త‌వం. ఇప్పుడు కాంగ్రెస్ నేత‌లు ఇలాంటి వారిపై దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. వారితో ట‌చ్‌లో ఉంటూ పార్టీలోకి తీసుకురావ‌డంతో పాటు ముఖ్య‌మైన స్థానాల్లో అవ‌కాశం క‌ల్పించేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే అధికార పార్టీలో గుంపులో గోవిందాలా ఉండ‌డం కంటే కాంగ్రెస్‌లో ఉంటే క‌నీసం గుర్తింపైనా ద‌క్కుతుంద‌ని ఆలోచిస్తున్న వారూ ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed