కేసీఆర్ హామీలను తీర్చాలని అడిగితే అరెస్టు చేస్తారా..?

by Sridhar Babu |
కేసీఆర్ హామీలను తీర్చాలని అడిగితే అరెస్టు చేస్తారా..?
X

దిశ, కరీంనగర్ సిటీ : టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ జంగ్ సైరన్‌కు తరలుతున్న జిల్లా కాంగ్రెస్ నేతలను శనివారం రెండు, మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ఏపీ రాష్ట్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటరీ ప్రాజెక్టుకు నీళ్లు తరలించుకుపోతుందన్నారు.

కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని రూ. లక్షల కోట్లను కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఐదు అత్యున్నత పదవులు తీసుకొని, తెలంగాణ ప్రజలు, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యేండ్లు గడుస్తున్నా కేసీఆర్ అమలు చేయకపోగా, ఎన్నికల హామీలు గుర్తు చేసేందుకు తలపెట్టిన ఆందోళనలను కూడా అణిచివేస్తున్నాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. నిరుద్యోగ భృతి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్కుమార్, ఉప్పరి రవి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కొమ్ము సునీల్, కొరివి అరుణ్, తమ్మడి ఏజ్రా, నాయకులు సత్యనారాయణ రెడ్డి, నిహాల్ తదితరులున్నారు.

Advertisement

Next Story