కేసీఆర్.. మా మీద అభాండాలు వేస్తున్నడు: వీహెచ్

by Anukaran |
కేసీఆర్.. మా మీద అభాండాలు వేస్తున్నడు: వీహెచ్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెక్రటేరియట్ పై ఉన్న ప్రేమ పేద రోగులకు వైద్యం అందించే ఉస్మానియా హాస్పిటల్ పై లేదని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. హన్మంతరావు అన్నారు. హాస్పిటల్ పాత భవనానికి మరమ్మత్తులు చేస్తే మరో 50 యేండ్ల పాటు సేవలందించే అవకాశం ఉన్నందున వెంటనే నిధులు కేటాయించి బాగు చేయించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా పాత భవనాన్ని అనుసరించి ఖాళీగా ఉన్న స్థలంలో 2015లో సీఎం చెప్పిన విధంగా నూతన భవనం నిర్మించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించారు. అనంతరం పాత భవనం డోమ్ గేటు వద్ద మీడియాతో మాట్లాడారు. సుమారు ఐదేండ్ల క్రితం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులు కట్టిస్తామని చెబితే మేమంతా నమ్మాం, చాలా మంచి పనే చేస్తుండు అనుకున్నాం.. చివరకు ఆయన చేసిన పని గిట్లా ఉందని వీహెచ్ అన్నారు.

నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోకపోగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వద్దన్నారని తమ మీద అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల వర్షాలకు నీరు లోనికి చేరడంతో రేపే కట్టిస్తున్నామన్నట్లుగా పాత భవనానికి తాళం వేశారని, అందులోని రోగులకు ఎక్కడికి తరలించారో మంత్రి ఈటెల రాజేందర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సచివాలయం విషయంలో హై కోర్టు నిర్ణయం ప్రకటించిన వెంటనే కూల్చి వేతలు మొదలు పెట్టారని, అదే ప్రేమ పేదల ఆస్పత్రిపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.

కరోనా కేసులు పెరిగి పోతున్న తరుణంలో ప్రజలకు కావలసింది మెరుగైన వైద్యమేనని అన్నారు. రూ 50 నుండి 100 కోట్లు కేటాయించి మరమ్మత్తులు చేయిస్తే నేడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఖాళీ చేసిన భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చరాదని, మరమ్మత్తులు చేయించి తిరిగి వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తాము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని వీహెచ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఫెరోజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story