రైతుల ఆందోళనలు ఆగవ్ : రాహుల్

by Shamantha N |
రైతుల ఆందోళనలు ఆగవ్ : రాహుల్
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నదని, రైతుల ఆందోళనలు ఇక ఆగవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. కేంద్రం వెంటనే నూతన సాగు చట్టాలను రద్దు చేసి డస్ట్ బిన్‌లో వేయాలని, లేదంటే రైతుల ఆందోళనలతో దేశంలో అస్థిరత ఏర్పడే ముప్పు ఉన్నదని అన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం తీసుకువచ్చిన చట్టాలపై రైతులందరికీ సమగ్రంగా అర్థం కాలేదు. పంజాబ్, హర్యానా, రాజస్తాన్‌లలోనే ఈ చట్టాలపై అవగాహన ఏర్పడింది. అందుకే వారి నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తున్నది. ఈ అవగాహన ఇతర భాగాల్లోనూ వస్తుంది. అందుకే కేంద్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

చట్టాలను రద్దు చేయకుంటే రైతు ఆందోళనలు ఇక్కడితో ఆగవు. నగరాలన్నింటికీ వ్యాపిస్తాయి. రైతులు తమంతట తాముగా వెనక్కి వెళ్లిపోతారనుకునే భ్రమలను కేంద్రం వదులుకోవాలి’ అని రాహుల్ తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీ హింసపై ప్రశ్నించగా, అసలు అలాంటివారిని ఎర్రకోటలోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడగాలని సూచించారు. ఇలాంటివి వదిలి రైతులపైనే ఆరోపణలు చేస్తున్నదని కేంద్రాన్ని విమర్శించారు. కేంద్రం వెంటనే రైతులతో సంప్రదింపులు జరపాలని అన్నారు. ప్రధానమంత్రి కేవలం కొంతమంది కోసమే పనిచేస్తున్నారని, నోట్లరద్దు, జీఎస్టీ, కొత్తసాగు చట్టాలు అందుకేనని ఆరోపించారు.

రైతుల నమ్మకమే దేశ పెట్టుబడి : ప్రియాంక గాంధీ

కర్షకుల నమ్మకమే దేశ పెట్టుబడి అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ‘వారి నమ్మకాలను వమ్ము చేయడం నేరం. వారి ఆందోళనలను వినకపోవడం పాపం. వారినే బెదిరించడం, భయపెట్టడం మహాపాపం. అలాంటి రైతులపై దాడి అంటే దేశంపై దాడే. గౌరవనీయులైన ప్రధాని, దేశాన్ని అస్థిరపరచవద్దు’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed