మెడపై కత్తి పెట్టి హుకుం జారీ చేస్తే ఎలా..? : జెడ్పీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి

by Sridhar Babu |   ( Updated:2021-10-26 23:49:48.0  )
Floar-Leader12
X

దిశ, కామారెడ్డి: రైతులను భయపెట్టి పంట మార్పిడి చేయించవద్దని కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అవగాహన, భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరి వేస్తే ఉరి అనే విధంగా ప్రభుత్వం రైతులను భయాందోళనకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారులతో ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినా పండించిన ఆరుతడి పంటలను ఎవరు కొంటారు.. మద్దతు ధర ఎంత ఇస్తారు.. లాంటి ప్రశ్నలు రైతులను వేధిస్తున్నాయని తెలిపారు.

గతంలో సన్నవరి సాగు చేయమని చెప్పి ఎలాంటి మద్దతు ధరను ప్రకటించకుండా రైతుల నడ్డి విరిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి పట్టును వీడాలన్నారు. వెంటనే ఆరుతడి పంటలు పండించాలనే విషయంలో అవగాహన కల్పించడంతోపాటు ఆరుతడి పంటల కొనుగోలు, మద్దతు ధరపై రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు, పెద్ద చెరువుల క్రింద ఆరుతడి పంటలు పండించడం సాధ్యం కాదని, అలాంటి రైతులకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యలను, సూచనలను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ ప్రభుత్వానికి, రైతులకు వారధిగా ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రైతు సమస్యలను, అనుమానాలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల మెడపై కత్తి పెట్టి ఈ పంట పండించాలని హుకుం జారీ చేయడం సరైనది కాదన్నారు. విత్తనాల షాపుల్లో వరి విత్తనాలు విక్రయించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని, ప్రభుత్వం వెంటనే రైతులతో సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story